స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న క్వాష్ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు రాబోతోంది. సెక్షన్ 17ఏ కింద రాష్ట్ర గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ శనివారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడాన్ని ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మెన్షన్ చేశారు. ఏపీలో ప్రతిపక్షాలను అణచివేస్తున్నారంటూ ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి లూథ్రా తీసుకొచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఇది ఏపీ రాష్ట్రానికి సంబంధించిన కేసు అని.. పిటిషనర్ కస్టడీలో ఉన్నారని, ఏపీలో ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. లూథ్రా అభ్యర్థనలు విన్న సీజేఐ.. ఆయన ఎప్పటినుంచి కస్టడీలో ఉన్నారని ప్రశ్నించగా... దీనికి సమాధానంగా సిద్ధార్థ లూథ్రా .. 8వ తేదీన అరెస్టు చేసినట్లుగా చెప్పారు. దీంతో సీజేఐ సెప్టెంబర్ 8 నుంచా... అయితే మంగళవారం మెన్షన్ చేయండి.. ఏం చేయాలన్నది చూస్తాం.. అంటూ విచారణను ముగించారు. మరోవైపు మరో ఐదురోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఏపీ సీఐడీ నిన్న ఏసీబీ కోర్టును ఆశ్రయించగా... ఈ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు సూచించింది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిలు పిటిషన్, సీఐడీ తాజాగా దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కలిపి ఒకేసారి విచారించి, రెండింటిపై ఒకేసారి నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది. వాదనలు వినేందుకు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఆ కేసులకు సంబంధించి కూడా ఈ రోజు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబును ఈ నెల 23, 24 విచారణ చేయాల్సిందిగా సీఐడీకి బాధ్యతలను అప్పగిస్తూ... విజయవాడ అవినీతి నిరోధక శాఖ కోర్టు 22వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను చంద్రబాబు సవాల్ చేసి... ఏపీ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేయగా... ఈ వ్యాజ్యాన్ని నిన్న హైకోర్టు పరిష్కరించింది. ఇప్పటికే పోలీస్ కస్టడీ ముగిసిపోయినందున ఇది నిరర్థకం అంటూ విచారణ మూసేసింది. సోమవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఈ మేరకు విచారణ ముగిసిందంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసుల వ్యవహారం ఎలా ఉన్నా... క్వాష్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందించబోతోందనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos