చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే భూమి కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య లోకి వెళ్లిన చంద్రయాన్ -3 తన వ్యాసాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు కేవలం 70 కిలోమీటర్ల దూరంలో నిలిచింది. చంద్రుడిపై ప్రస్తుతం చేస్తున్న ప్రయాణ వేగం తక్కువగా ఉండటంతో ... రేపటి కల్లా చంద్రుడిపైకి సురక్షితంగా ల్యాండ్ కాబోతోంది. చంద్రయాన్ ల్యాండర్ లో ఇస్రో పెట్టిన కెమెరా ... 70 కిలోమీటర్ల దూరం నుంచి చంద్రుడి ఫొటోలు తీసి పంపింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువం ఎలా ఉందో ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఎప్పటికప్పుడు చంద్రయాన్-3 మిషన్ అప్ డేట్స్ ఇస్తున్న ఇస్రో.. ఈ ఫొటోల్ని కూడా విడుదల చేసింది. వీటిని చూస్తే వాస్తవంగా చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. మట్టిలో వర్షపు చుక్కలు పడితే ఎలా ఉంటుందో అలా ఉన్న చంద్రుడి ఉపరితలం ఇందులో కనిపిస్తోంది. చంద్రయాన్-3 మిషన్ కు సంబంధించి ఇస్రో షేర్ చేసిన అప్ డేట్ ప్రకారం.. మిషన్ ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం పయనిస్తోందని... సిస్టమ్‌లతో సాధారణ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం రేపు సాయంత్రం 5.20 నిమిషాలకు ప్రారంభిస్తామని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-3 ల్యాండింగ్ దృశ్యాలను తెలంగాణలోని ప్రతీ విద్యార్థి చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలలో లైవ్ స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖకు సూచించింది. ఈ మేరకు డీఈవోలు, ప్రిన్సిపల్స్ కు స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ విద్యా ఛానెల్స్ టీశాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక స్క్రీన్లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు చూపిస్తామని చెప్పారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ ను లైవ్ లో అందించేందుకు ఇస్రో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. విద్యార్థులు, యువత దీన్ని చూడాలని విజ్ఞప్తి చేసింది. చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రార్థించాలని దేశ ప్రజలను కోరింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos