తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీ ఆర్ఎస్ పార్టీకి వలస శాకం తగులుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చేరికలకు గేట్లెత్తేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే పనిలో పడ్డారు. బీఆర్ఎస్‌లో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకులను మళ్లీ సొంత గూటికి రప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌కు
పంపించారు. అదేవిధంగా బీఎస్పీ నేత, పటాన్‌చెరులోని ముదిరాజ్ నాయకుడు నీలం మధు కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారీ ర్యాలీతో గాంధీ భవన్‌కు వచ్చిన నీలం మధు.. పెద్ద మొత్తంలో తన అనుచరులతోపాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు పేరు ప్రధాన వార్తాపత్రికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఆయన కేవలం 15 రోజుల్లోనే మూడు పార్టీలు మారడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆయన మరోసారి పార్టీ మారే విషయమై వార్తల్లోకి వచ్చారు. తాజాగా, ఆయన బీఎస్పీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఎడపల్లి జెడ్పీటీసీ , జిల్లా వైస్ చైర్ పర్సన్ రజిత యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కాంగ్రెస్‌కు చెందిన రజిత - ఎల్లయ్య యాదవ్‌ల దంపతులు బీఆర్ఎస్‌లో చేరి ఎడపల్లి జెడ్పీటీసీ గెలిచి మాజీ ఎమ్మెల్యే షకీల్ అండతో జెడ్పీ చైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు అధికార కాంగ్రెస్‌లో చేరుతుండటంతో ... బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos