పార్లమెంట్ లో మణిపూర్ అంశంపై వరుసగా నిరసనలకు దిగుతున్న విపక్షాలు ఎట్టకేలకు అవిశ్వాస తీర్మానం రూపంలో ఎన్డీయే సర్కార్ ను ఇరుకునపెట్టబోతున్నాయి. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిత్యం మణిపూర్ పై ఉభయసభలు నిరసనలతో అట్టుడుకుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ... కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చింది. దీన్ని అంగీకరించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఎట్టకేలకు చర్చకు తేదీలు ఖరారు చేశారు.
ఆగస్టు 8 నుంచి మూడురోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10వ తేదీన ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. లోక్ సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో చర్చ ప్రారంభమై... మణిపూర్ అల్లర్లకు కారణం, వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం, మహిళల నగ్న ప్రదర్శన వంటి అంశాలపై లోక్ సభలో సుదీర్ఘంగా చర్చించనున్నారు.
ఇందుకు తగ్గట్టుగా పార్టీల బలాబలాల ఆధారంగా ఆయా పార్టీల ఎంపీలు మాట్లాడేందుకు స్పీకర్ తగిన సమయం కూడా కేటాయించారు. చర్చ అనంతరం ఈ నెల 10న ప్రధాని మోడీ సమాధానం చెబుతారు. అనంతరం ఓటింగ్ జరుగుతుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మణిపూర్ సహా పలు అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను బలంగా వినిపించడానికి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ సరైన వేదిక అని ప్రధాన విపక్ష కూటమి ‘ఇండియా’ భావిస్తోంది. మరోవైపు, విపక్షం తీరును ఎండగడుతూ... ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెట్టడానికి ఈ చర్చను ఉపయోగించుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. లోక్ సభలో విపక్ష, అధికార పక్ష బలాబలాలను పరిశీలిస్తే.. అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశాలు లేవని అర్థం అవుతుంది. లోక్ సభలో అధికార ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. విపక్షాల కూటమి ఇండియాకు 144 మంది సభ్యులు ఉన్నారు. అందువల్ల, ఈ తీర్మానం వీగిపోవడం లాంఛనమే. ఈ తీర్మానంపై విజయం సాధించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ.. మణిపూర్ పై ప్రధాని స్పందించాలనే లక్ష్యంతోనే విపక్షాలు దీన్ని ప్రవేశపెట్టారు. మండిపోతున్న మణిపూర్ సహా దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా వెలుగులోకి వస్తాయి.
ముఖ్యంగా మణిపూర్ లో కొనసాగుతున్న సంక్షోభంపై చర్చ జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఒక స్పష్టత వస్తుంది. అవిశ్వాస తీర్మానం అనంతరం... ప్రధాని మోడీ ఇచ్చే ప్రకటన ఆధారంగా విపక్షాలు తదుపరి కార్యాచరణను సిద్ధం చేసుకోబోతున్నాయని తెలుస్తోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos