ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు సుప్రీంకోర్టులో కాసింత ఊరట లభించింది. లిక్కర్ కేసు వ్యవహారంలో భాగంగా గత మార్చి నెలలోను... అంతకుముందు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు పలుమార్లు హాజరైన సంగతి తెలిసిందే. మార్చిలో జరిగిన విచారణకు నోటీసులు ఇచ్చిన విషయంలో ఓ మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా అనే దానిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
ఈ అంశంపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఎమ్మెల్సీ కవిత పక్షాన నిలిచింది. ఈడీపై కవిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. కాగా గతంలో కవిత ను విచారించిన ఈడీ ... ఆమె దగ్గరి నుంచి కీలక పత్రాలు, పలు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో కవిత మూడు సార్లు విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో.... గత ఏడాదికాలంగా కవిత వాడిన 10 ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటాను తీసే పనిలో నిమగ్నమయ్యారు. కవిత సమర్పించిన ఫోన్లలో డేటాను సేకరించిన అనంతరం దానిని విశ్లేషించి ... దాని ఆధారంగా కవిత విచారణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. కాగా... విచారణ కోసం మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మహిళను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ ధర్మాసనం విచారణ చేసింది. కవిత పిటిషన్ ను పరిగణలోకి తీసుకుని.. ఆ పిటిషన్ పై ఆరువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని కవితకు సూచించింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహద్గీ వాదనలు వినిపించారు. విచారణకు తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్ రావు కూడా హాజరు అయ్యారు. ఈ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos