అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా ఉన్న టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు విచారించింది. ఈ సందర్భంగా ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. లోకేశ్ ను అరెస్ట్ చేయబోమని, సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని కోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఒకవేళ దర్యాప్తుకు లోకేశ్ సహకరించకపోతే, ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తామని, ఆ తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పారు. 41ఏ నిబంధనలను పూర్తిగా పాటిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్పందిస్తూ... లోకేశ్ అరెస్ట్ పై ఆందోళన లేనందువల్ల విచారణను ముగిస్తున్నామని తెలిపింది. కాగా... అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ ను సీఐడీ ఏ14గా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో లోకేశ్ ను సీఐడీ అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టులో లోకేశ్ ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు విచారణకు స్వీకరించిన క్రమంలో తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. శుక్రవారం విచారణ ప్రారంభం కాగానే... సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్, లోకేష్ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ మేరకు కోర్టు లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.. విచారణకు సహకరించాలని లోకేష్‌కు సూచిస్తూ.... ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ టీమ్ ఢిల్లీలో లోకేష్‌కు నోటీసులు అందజేయనుంది. లోకేష్ కొద్దిరోజులుగా ఢిల్లీలోనే ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలెన్ మెంట్ కేసులో చంద్రబాబు ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాగా... ఈ కేసులో ఏ 2గా ఉన్న మాజీ మంత్రి నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు. ఇదిలాఉండగా... అన్నమయ్య జిల్లా అంగళ్ళ అల్లర్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అంగళ్ళ అల్లర్ల కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా... లేక హైకోర్టు బెయిల్ తిరస్కరిస్తుందా... అని చంద్రబాబు, సీఐడీ తరఫున న్యాయవాదులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos