టాలీవుడ్ ను ... డ్రగ్స్ మాఫియా వీడేలా కనిపించడం లేదు. తెలుగు సినిమా పరిశ్రమను మరోసారి డ్రగ్స్ కలకలం సంచలనం రేపింది. ఇటీవల హైదరాబాద్ పోలీసులకు చిక్కిన డబ్బింగ్ సినిమాల నిర్మాత, డ్రగ్స్ డీలర్ సుంకరి కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరిని విచారించగా సినీ తారల బాగోతం బయటపడింది. పోలీసుల విచారణలో భారీగా సినీ తారల పేర్లు బయటకు వస్తున్నాయి.
తెలుగు సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్‌గా పేరు ఉన్న కేపీ చౌదరి ... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం లాంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే... ఆయనకు సినీరంగంలో భారీగా నష్టం రావడంతో గోవాకు వెళ్లి నైట్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో... డ్రగ్స్ డీలింగ్ ఘటనలో కేపీ చౌదరిని మూడు రోజులపాటు పోలీసులు విచారించగా పలువురు సినీ తారలు, బిజినెస్ మ్యాన్లు, ఇతర ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
కేపీ చౌదరితోపాటు నైజీరియాకు చెందిన గ్యాబ్రియల్ కూడా అరెస్ట్ కావడం, అతడి వద్ద 110 గ్రాములకుపైగా కొకైన్ లభించిన విషయం తెలిసిందే. పోలీసులు కేపీ చౌదరి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని కాల్ డేటా పరిశీలించగా... లిస్టులో అషురెడ్డి పేరు కనిపించినట్లు సమాచారం. పలుమార్లు ఆమెతో ఫోన్‌లో మాట్లాడినట్టు ప్రధాన మీడియాలో కథనాలు వస్తున్నాయి. అషురెడ్డి ... బిగ్‌బాస్ తెలుగు షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. రాంగోపాల్ వర్మతో శృంగారపరమైన ఇంటర్వ్యూతో ఆమెకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. డ్రగ్స్ కేసులో తన పేరు వెలుగులోకి రావడంపై అషురెడ్డి తాజాగా స్పందించారు.
తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ... అవన్నీ తప్పుడు ఆరోపణలని ఆమె సోషల్ మీడియా వేదికగా ఖండించారు. తనకు డ్రగ్స్‌కు సంబంధించి ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవని... సమయం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తుల గురించి అన్ని విషయాలు చెబుతానని అన్నారు. అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ ప్రచురిస్తే అస్సలు ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు తనపై ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో అఘురెడ్డి మాత్రమే కాకుండా ఇంకా పలువురు తారల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందని ... పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేస్తే... వారెవరో తేలిపోతుందని అంటున్నారు. మొత్తంమీద తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos