తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక నీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ రోజు ... రేపు కూడా హైదరాబాద్ తో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్నిసార్లు అత్యంత వేగంగా జల్లులు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది.
భారీవర్షాల కారణంగా నగరంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తవచ్చని ... విద్యుత్, నీటి సరఫరాలకు కూడా అంతరాయం ఏర్పడవచ్చని, డ్రైనేజీ సమస్యలు తలెత్తవచ్చని పేర్కొంది. నగరంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. కాగా వర్షాలతో నడిరోడ్డుపై వాహనాలు మొరాయిస్తే, ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. వర్షానికి బండి ఆగిపోతే వెంటనే 83339 93360 నెంబర్‌కు వాట్సప్ కాల్ చేస్తే సైబరాబాద్ పోలీసులు సహాయం చేస్తారు. ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధి వరకు మాత్రమేనని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు అధికారులు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల ధాటికి గోదావరి పోటెత్తడంతో భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వరద ప్రవాహం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం.. వంటి మండలాలకు వెళ్లే రహదారులపై వరదనీరు చేరుకోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండి ప్రాజెక్టు గేట్ల పై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కులు వస్తోంది. 14 గేట్లు ఎత్తినప్పటికి ఎగువ నుంచి ఇన్ ఫ్లో అధికంగా ఉండడంతో వరద నీరుపై నుంచి వెళ్తోంది. ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు తెగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉండగా 14 గేట్లు తెరుచుకున్నాయి. 4 గేట్లు మొరాయించాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులు... ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా వరద పోటెత్తుతోంది. భారీవర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos