స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శనివారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేశారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు నేడు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు.
ఇదిలావుండగా... చంద్రబాబు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం ఆదివారం పొడిగించింది. స్కిల్ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు వారాల కిందట అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారంతో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో చంద్రబాబు రిమాండ్ ను న్యాయమూర్తి అక్టోబర్ 5వ తేదీ వరకు అంటే మరో 11 రోజులు పొడిగించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరింది. కాగా... సీఐడీ కస్టడీ పూర్తైన తర్వాత చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు వర్చువల్ గా హాజరుపర్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మాట్లాడారు. విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా ... వైద్య పరీక్షలు చేయించారా అని చంద్రబాబును జడ్జి ప్రశ్నించారు. విచారణ సమయంలో సీఐడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు జడ్జి దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ... మీ బెయిల్ పిటిషన్‌ను సోమవారం విచారిస్తున్నామని చంద్రబాబుతో చెప్పారని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos