టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. పోలవరం నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది. ఇందులో భాగంగా పోలవరం నిర్వాసితులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. నిర్వాసితుల కోసం నాలుగు వేల కోట్లు ఖర్చు చేశామని ... టీడీపీ హయాంలో 72 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు. మోసానికి మరో రూపం సైకో జగన్ అంటూ విరుచుకుపడ్డారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.10 లక్షలు ఇస్తామన్నారని.. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుఢు పోలవరం నిర్వాసితులకు అనేక హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక జగన్ చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేంద్రం ఏమైనా ఇస్తేనే ఆయన బటన్ నొక్కుతున్నారని వ్యాఖ్యలు చేశారు. అప్పుడొక మంత్రిగారు ఉండేవారని.. బుల్లెట్ దిగిందా అని విమర్శలు చేశారని.. ఇప్పుడు ఆయనకే బుల్లెట్ దిగిందంటూ ఎద్దేవా చేశారు. కనీసం నెల్లూరు టికెట్ వస్తుందో లేదో ఆయనకే తెలీదన్నారు. ఇప్పుడు ఉన్న మంత్రి గారు పోలవరం గురించి తనను అడగవద్దని అంటున్నారని లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదంలో ఉందని ... డయాఫ్రం వాల్ పరిస్థితిపై ప్రభుత్వానికే స్పష్టత లేదని ... అందుకే... పోలవరం ప్రాజెక్టుపై ఈ ప్రభుత్వం ఏమీ చెప్పలేకపోతోందని లోకేశ్ విమర్శించారు. సమగ్ర అధ్యయనం చేస్తే తప్ప... పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని పేర్కొన్నారు. 45.72 మీటర్ల ఎత్తుతో పోలవరం కట్టాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నామని... ఆ మేరకు తెలంగాణ నుంచి ముంపు మండలాలను ప్రధాని మోదీ సహకారంతో విలీనం చేసుకున్నామని అన్నారు. ఇప్పుడు టీడీపీ లక్ష్యం ఏమిటంటే... నిర్దేశించిన ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, నిర్వాసితులకు నష్ట పరిహారాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద అందజేయడం, నిర్వాసితులకు మౌలిక సదుపాయాలతో కూడిన కాలనీలు నిర్మించడమేనని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పక నెరవేరుస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నానని లోకేశ్ తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos