టీడీపీ అధినేత చంద్రబాబు కు ఈ రోజు కీలకమైన రోజు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో లిస్ట్ అయింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టి ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలను వినిపించనున్నారు. సిద్ధార్థ్ లూథ్రా నేరుగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనుండగా, హరీశ్ సాల్వే ఫ్రాన్స్ నుంచి వర్చువల్ గా వాదనలు వినిపించనున్నారు. మరోవైపు జస్టిస్ ఎస్వీ భట్టి ఏపీకి చెందిన వ్యక్తి కావడంతో... ఆయన 'నాట్ బిఫోర్ మీ' అని చెప్పే అవకాశం కూడా ఉందని అంటున్నారు. జస్టిస్ ఎస్వీ భట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందినవారు. ఒకవేళ ఆయన నాట్ బిఫోర్ మీ తీసుకుంటే... రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో విచారణ వాయిదా పడే అవకాశం ఉంటుంది. అయితే ఇదే సమయంలో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు మాత్రం పంపుతుంది. రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు మధ్యంతర ఊరటను కలిగించే అవకాశాలు కూడా ఉండొచ్చు. మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో పిటిషన్ విచారణకు రావచ్చని భావిస్తున్నారు. చంద్రబాబు పిటిషన్ పై ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. మరోవైపు అమరావతి రింగురోడ్డు కేసును ఈ రోజే ఏపీ హైకోర్టు విచారించనుంది. ఈ కేసులో బెయిలు కోరుతూ టీడీపీ అధినేత ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా.. తనకు మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న వ్యాజ్యాలపై కూడా ఈ రోజే విచారణ జరిగింది. విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు మంగళవారం సెలవు పెట్టడంతో.. విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ కేసులన్నీ ఈ రోజే విచారణ జరుగనుండటంతో ఎలాంటి తీర్పులు వెలువడతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos