స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయింది. జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్ పిటిషన్ విచారణ చేపట్టారు. భోజన విరామ సమయం కావడంతో ... మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారణ తిరిగి ప్రారంభమైంది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వేలు వాదనలు వినిపిస్తున్నారు. రేపటి నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో... సుప్రీంకోర్టు చంద్రబాబు పిటిషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో .. చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు జరుగుతున్నాయి. ఇదలా ఉంచితే... అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను సీఐడీ ఏ14గా పేర్కొంటూ సీఐడీ అధికారులు కోర్టులో ఈ నెల 26న మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేయడంలో లోకేష్ చక్రం తిప్పారని సీఐడీ ఆరోపణలు చేసింది. ఆయన సన్నిహితులకు ప్రయోజనం కల్గించేలా ప్రయత్నాలు చేశారని సీఐడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్టైన తర్వాత ఢిల్లీకి వెళ్లిన లోకేష్ అక్కడే ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్‌పీపై విచారణ తర్వాత లోకేష్ న్యూఢిల్లీ నుండి రాజమండ్రికి తిరిగి రానున్నారు. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్ కు చెందిన అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు పలువురిని సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ లో చేర్చిన విషయం తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos