ఓవైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఇవి చాలవన్నట్లు ఉపరితల ఆవర్తనం వెరసి... తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం కాస్త తెరిపి నిచ్చిన వర్షం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మళ్లీ మొదలైంది. వర్షంతో రోడ్లపై నీరు చేరడంతో... పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. మరో నాలుగైదు రోజులు కుండపోత తప్పదని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో జన జీవనం స్తంభించిపోయింది, హుస్సేన్ సాగర్ పోటెత్తుతోంది. తూము ద్వారా అధికమొత్తంలో నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. మరోవైపు,  జీహెచ్ఎంసీ పరిధిలోని అన్నిరకాల విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 22 వరకు సెలవులు ప్రకటించారు.

ప్రయివేట్ సంస్థలు కూడా వారి వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా... వరంగల్ లో కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి పెరిగింది. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో కూడా వానలు భారీగా పడుతున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదని రోడ్లు, చెరువులు, కుంటలకు ఎటువంటి నష్టం జరగలేదని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలంగాణ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో 50 శాతం నీరు ఉందని భారీ వర్షాలు, వరదలతో ఇప్పటివరకు ఎటువంటి సమస్య లేదని పేర్కొన్నారు.

మరోవైపు ఏపీలో కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాష్ట్రంలో మరో 3 రోజులు ముసురు వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో కురుస్తున్న వర్షాలతో పాటు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉద్ధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటుచేసి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. గోదావరికి పెరుగుతున్న వరద ఉద్ధృతి కారణంగా... భద్రాచలం వద్ద నీటిమట్టం 43.9 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయగా, ప్రస్తుతం పోలవరం వద్ద 11.97 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos