తెలంగాణను ప్రస్తుతం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో కుండపోత కురుస్తోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన గాలులకు చెట్లు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్‌లో ఓ చెట్టుకొమ్మ విరిగి కరెంట్ పోల్‌పై పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.
5 జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో భారీ వర్షం కురుస్తోంది. అటవీ ప్రాంతాల్లోని వాగుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కుమురంభీం జిల్లా బెజ్జూర్‌లో 14 సెం.మీ వర్షం పాతం నమోదైంది. మెదక్ జిల్లా వెల్దుర్తిలో 15 సెం.మీ, దామరంచలో 13 సెం.మీ, రాజపల్లిలో 12 సెం.మీ వర్షపాతం రికార్డయింది. యాదాద్రి భువనగిరిలోని రాజాపేట మండలంలో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. గోదావరి ఎగువ నుంచి నీరు పోటెత్తడంతో భద్రాచలం వద్ద 39 అడుగులకు నీరు చేరింది. మరో నాలుగు అడుగుల మేర అంటే... 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. ఎగువన ఉన్న తాలిపేరు, మేడిగడ్డ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని విడుదల చేయడంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక్కడ ఆరు లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజాగా వస్తున్న ఫ్లో తో అధికారులు అప్రమత్తం అయ్యారు. నిజామాబాద్ జిల్లా మాధవ్‌నగర్‌లో వరద ప్రవాహానికి బ్రిడ్జి కొట్టుకుపోయింది. నిజామాబాద్-డిచ్‌పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నవీపేట మండంలోని జన్నేపల్లి పెద్ద చెరువు అలుగు పారుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కోయగూడెంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులకు జలకళ సంతరించుకున్నది. ఇక వ్యవసాయ పనులు జోరందుకుంటాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. గోదావరికి వస్తున్న భారీ వరదతో కాళేశ్వరం వద్ద ప్రవాహం పెరుగుతోంది. అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజులు కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద ప్రవాహం ముమ్మరం కావడంతో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం పెరుగుతోంది. కాగా.. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు, రేపు సెలవు ఇచ్చామని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రకటించారు
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos