ఎప్పుడెప్పుడా అని పవన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న బ్రో చిత్రం... ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ పలు మార్పులు చేర్పులు చేశారు. ఇక తమిళంలో తంబిరామయ్య పోషించిన పాత్రను ఇక్కడ సాయి ధరమ్ తేజ్ చేయగా.. దేవుడిగా పవన్ కళ్యాణ్ చేశారు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా ఎవ్వరికీ అంచనాల్లేవు కానీ... టీజర్, ట్రైలర్‌లు... సినిమాపై మంచి హైప్ తెచ్చిపెట్టాయి. శుక్రవారం ఈ సినిమా పెద్ద ఎత్తున రిలీజైంది. పలువురు సినీ లవర్స్ తమ తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. పవన్ ఫ్యాన్స్ ... ఓ రేంజ్‌లో ఫ్లెక్సీలు కట్టి సందడి చేశారు. ఈ సినిమా కథ ఏమిటంటే... ఇంటికి పెద్ద కొడుకైన మార్క్ అలియాస్ మార్కండేయులు పాత్రధారి సాయిధరమ్ తేజ్... తండ్రి మరణం తర్వాత అన్ని బాధ్యతలను తన భుజాన మోస్తుంటాడు. ఇద్దరు చెల్లెళ్లు. తమ్ముడు స్థిరపడాలని... ఉద్యోగంలో తను మరింత ఎత్తుకు ఎదగాలని నిరంతరం శ్రమిస్తుంటాడు. ఓ రోజు ఊహించని రీతిలో ఓ రోడ్డు ప్రమాదం జరుగుతుంది. తనవాళ్లెవరూ జీవితంలో స్థిరపడలేదని, తాను చేయాల్సిన ఎన్నో పనులు మిగిలిపోయాయని... తన జీవితానికి ఇంత తొందరగా ముగింపునివ్వడం అన్యాయమని.. కాలం అనే దేవుడి పాత్రధారి పవన్ కల్యాణ్ పటం ముందు మొరపెట్టుకుంటాడు తేజ్. దాంతో కాలం దేవుడు అనుగ్రహించి 90 రోజులు అతని జీవితకాలాన్ని పెంచుతాడు. అలా మళ్లీ ఇంటికి చేరిన మార్క్ 90 రోజుల్లో అనుకున్నవన్నీ చేశాడా... అతనివల్లే పనులన్నీ అయ్యాయా... ఆ 90 రోజుల సమయంలో ఏం తెలుసుకున్నాడన్న అంశాలతో మిగతా కథ ఇంట్రస్ట్ గా సాగుతుంది.
తారాస్థాయిలో ఇమేజ్... బలమైన అభిమానగణం ఉన్న పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉంటుందంటే చెప్పాల్సిన అవసరమే లేదు. ఏమాత్రం వాణిజ్యాంశాలు లేని 'వినోదయ సిత్తం' ని పవన్ కల్యాణ్ తో రీమేక్ చేయడం అంటే కత్తిమీద సామే. వాణిజ్యాంశాల విషయంలో ఉన్న ఆ సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తూ.. పవన్ ఇమేజ్ గురించి బాగా తెలిసిన త్రివిక్రమ్... తనదైన శైలిలో రచన చేశారు. పవన్ కల్యాణ్ గత సినిమాల్లోని పాటలు ఆయన మేనరిజమ్స్... ఆయన గెటప్స్ ని పక్కాగా సినిమాలోని సన్నివేశాలకి తగ్గట్టుగా మలిచారు. అవి ఎప్పటికప్పుడు అభిమానులతో ఈలలు కొట్టించేలా ఉన్నాయి. పవన్ కల్యాణ్ చెప్పే సంభాషణలు కూడా ఆయన భావాలు ... రాజకీయ సిద్ధాంతాలకి అనుగుణంగా ఉన్నాయి. పాటలు, సంభాషణలు వెరసి పవన్ కల్యాబ్ తెరపై వీరోచితంగా ఫైట్లు చేయడం లేదనే విషయాన్ని కూడా మరిపిస్తాయి. పవన్ పోషించిన పాత్ర ఔచిత్యానికి తగ్గట్టుగానే... ఆయన చిటికేసిన ప్రతిసారీ హీరోయిజం పండుతుంది. వీటి మధ్య ప్రధాన కథకి ఎక్కడా సమస్య రాకుండా చూసుకోవడంలో సముద్రఖని విజయవంతం అయ్యారు. పవన్ కల్యాణ్.. సాయిధరమ్ తేజ్ మధ్య మెప్పించే సన్నివేశాలు సినిమాకి బలం చేకూర్చాయి. సాయిధరమ్ తేజ్ ప్రేయసిగా కేతిక శర్మ కనిపించేది కొద్దిసేవే అయినా... చిన్న పాత్రే అయినా ఓ పాటలో అభినయంతో... అందంతో ఆకట్టుకుంటుంది. మరో కథానాయిక ప్రియా వారియర్ పాత్ర ఆశ్చర్యపరుస్తుంది. రోహిణి, సుబ్బరాజు తదితరులు అలవాటైన పాత్రల్లోనే కనిపిస్తారు. బ్రహ్మానందం చిన్న పాత్రలో మెరుస్తారు. వెన్నెల కిశోర్, రోహిణి, తనికెళ్ల భరణి, అలీ రెజా తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ పాటల కంటే నేపధ్యసంగీతం బాగుంటుంది. త్రివిక్రమ్ రచన అభిమానుల్ని మెప్పించింది. మొత్తానికి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos