విజయవాడలోని కేపీనగర్‌లోగల టీవీఎస్ వాహనాల షోరూంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఈ షోరూం ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో షోరూంలోని మూడు వందల వరకు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాల షో రూంతో పాటు సర్వీస్ సెంటర్, గోడౌన్ కూడా ఇదే ప్రాంతంలో ఉండటంతో పెద్దసంఖ్యలో వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. విజయవాడ నగరంతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం కావడంతో వందల సంఖ్యలో వాహనాలు గోదాంలలో ఉంచుతారు. మొదట షోరూంలోని మొదటి అంతస్తులోనే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వచ్చాయి. కొద్ది సమయంలోనే మంటలు గోదాంకూ వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజిన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. ఫ్రీఫ్యాబ్రిక్ పద్ధతిలో షోరూం నిర్మించడం, గోదాములో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉండటం, పెట్రోల్ వాహనాలకు సమీపంలోనే ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ పెట్టడం తదితర కారణాలతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెద్దసంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా పార్క్ చేసి ఉంచడమే కాకుండా... వాటికి ఛార్జింగ్ పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos