తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్ శిబిరంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ లను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. శిబిరంలో ఉన్న సుమారు 2వేల మందిని మూకుమ్మడిగా పోలీసులు అరెస్టు చేశారు. టెంట్ కూల్చేసి, లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో ఎక్కించారు. గత 42 రోజులుగా విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన క్రమంలో... ముందుగానే అప్రమత్తమైన పోలీసులు వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడీ నేతలను పోలీసులు బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించారు. నిద్రపోతున్న అంగన్వాడీల మీద పోలీసులు జులుం ప్రదర్శించారు. అర్ధరాత్రి దాటాక ... ఎవరూ లేని సమయంలో పోలీసులు అరెస్టు చేసి వారిని బందరుకు తరలించారు. ప్రభుత్వ చర్యలపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా అంగన్వాడీల ఛలో విజయవాడ నిరసన కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని పోలీస్ కమీషనర్ తెలిపారు. కాబట్టి అంగన్వాడీలు ఎవరూ విజయవాడకు రావద్దని సూచించారు. 'జగనన్నకు చెబుదాం' పేరిట కోటి సంతకాలతో కూడిన ప్రతులను ముఖ్యమంత్రికి ఇస్తామని అంగన్వాడీలు ప్రకటించారు. దీంతో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు భద్రతను పెంచారు. ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని అమలు చేసింది. సమ్మెను విరమించి విధుల్లో చేరనివారిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని హెచ్చరిస్తోంది. అయినప్పటికీ అంగన్వాడీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దీంతో విధులకు హాజరుకాని అంగన్వాడీ వర్కర్లు, సహాయకులను తొలగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos