కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నుంచి ప్రచారసరళిని పూర్తిగా మార్చేశారు. అంతకుముందు ప్రచారంపై పెద్దగా ఆసక్తి చూపించని రాహుల్...జోడో యాత్రతో అందరికీ చేరువయ్యారు. పార్టీ గెలుపు ఓటముల గురించి పక్కన పెడితే క్యాడర్లో కొత్త జోష్ తెచ్చిపెట్టారు. రాహుల్ మునుపటిలా కాకుండా... కార్మికులు, రైతులు, కూలీలతో తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంకగాంధీ కూడా దాదాపు అన్నిచోట్లా కనిపిస్తున్నారు. ఇద్దరూ కలిసి పార్టీలో కొత్త జోష్ నింపేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
ఇదిలావుండగా... రాహుల్ గాంధీ జులై 8న హర్యానాలోని సోనిపట్ జిల్లా, మదీనా గ్రామంలో ఓ పొలంలోకి వెళ్లారు. అక్కడి మహిళలతో మాట్లాడారు. వరి నాట్లు వేశారు. ట్రాక్టర్‌ను నడిపారు. కూలీలు, కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చిన ఆహారాన్ని స్వీకరించారు. మేము ఢిల్లీకి సమీపంలో ఉన్నప్పటికీ ఆ నగరాన్ని ఎప్పుడూ చూడలేదని ఆ మహిళలు ఆయనకు చెప్పారు. అప్పుడు ఆయన వారికి ‘ఢిల్లీ దర్శన్’ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఆయన తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో ఆ మహిళల చేత ఫోన్ ద్వారా మాట్లాడించారు. అప్పుడు వారు ‘‘మేం మీ ఇంటికి భోజనానికి వస్తాం’’ అని చెప్పారు. ఈ క్రమంలోనే హరియాణాలోని సోనిపట్‌కు చెందిన మహిళా రైతులు ఇటీవల ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసానికి రావడంతో సోనియా గాంధీ నివాసం పెళ్లివారి ఇల్లులా కళకళలాడింది.
సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ వాద్రా గ్రామీణ మహిళలతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేస్తూ, కలుపుగోలుగా మాట్లాడుతూ, వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వారు తీసుకొచ్చిన బహుమతులను స్వీకరించి, వారితో కలిసి నృత్యం చేశారు. మహిళా సాధికారతతో పాటు జీఎస్టీ గురించి మహిళా రైతులతో మాట్లాడారు.
ప్రభుత్వం నా ఇల్లుని లాక్కుందని.. అందుకే ఇక్కడికి పిలిచానని రాహుల్ వాళ్లకు చెప్పారు. మహిళలు ఎప్పుడూ వెనకబడి ఉండకూడదని, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడాలని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ముచ్చడించుకుంటుండగా... సోనియా గాంధీతో ఓ మహిళ ఓ సరదా ప్రశ్న వేసింది. రాహుల్‌కి పెళ్లి చేయొచ్చుగా అని ఆమె అడిగింది. అందుకు సోనియా గాంధీ తడుముకోకుండా "అమ్మాయిని చూసి పెట్టొచ్చు గా" అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇది వినగానే అందరూ గట్టిగా నవ్వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నాకు, అమ్మకి, ప్రియాంకకి ఇది మర్చిపోలేని రోజని... మా ఇంటికి చాలా ప్రత్యేకమైన అతిథులు వచ్చారని... సోనిపట్ మహిళా రైతులు మాతో కలిసి డిన్నర్ చేశారు.... సరదాగా గడిపారని... మాకు ఎన్నో విలువైన కానుకలూ ఇచ్చారని... నెయ్యి, లస్సీ, ఇంట్లో చేసిన పచ్చళ్లతో పాటు ప్రేమనీ అందించారని ట్వీట్ చేశారు.
రాహుల్ ఇటీవల హర్యానాలో పర్యటించినపుడు మాకు ఇచ్చిన మాట నిలుపుకొని, ‘ఢిల్లీ దర్శన్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఆ మహిళలంగా చాలా సంతోషంగా చెప్పారు. సో... సోనియాగాంధీ నివాసం మహిళల సంతోషానికి వేదికగా నిలిచిందని పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos