ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను ఏది తలిస్తే ... అదే చేసేంత మూర్ఖుడని... ఎవ్వరు సలహాలు ఇచ్చినా.. తన పద్ధతి మార్చుకోరని ప్రజల నుంచి పదేపదే విమర్శలు వస్తున్నా... ఆయన మాత్రం తన పంథా వీడటం లేదు. తాజాగా ఆయన చేసిన ఇలాంటి పనే విమర్శలకు తావిస్తోంది. తన సొంత పత్రిక 'సాక్షి'లో పని చేసిన నేమాని భాస్కర్ కు ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారు పదవి కట్టబెడుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. అదీ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. జగన్ కుటుంబం ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రికలో పనిచేసిన వారికి... ఆయన ప్రభుత్వంలోనే పదవి కట్టబెట్టడం అధికార దుర్వినియోగం కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. అస్మదీయులకు సలహాదారుల పోస్టులు కట్టబెడుతూ నెలకు రూ. లక్షల్లో జీతాలు, అలవెన్సులు చెల్లిస్తున్నారు. 50 మందికి పైగా సలహాదారుల్ని ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల తలలు నెత్తిన కుంపటిలా పెట్టారు. వారిని ఎలా దించుకోవాలో తెలియక ... జీతాలు చెల్లించలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరో మూడునెలల్లో ఎన్నికలు వస్తున్నా.. జగన్ ప్రభుత్వం ఎలాంటి జంకు, గొంకూ లేకుండా సలహాదారుల నియామకాల్ని కొనసాగిస్తూనే ఉండటం గమనార్హం. అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా.. సొంత సంస్థల్లో పనిచేసే వారిని ప్రభుత్వంలో నియమించాలంటే కాస్త ఆలోచిస్తారు. ప్రజలు ఏమనుకుంటారో అనే భీతి అయినా ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ మాత్రం... సొంత పత్రికలో పనిచేసిన వారిని పిలిచి, ప్రభుత్వ పదవులు కట్టబెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వంలోనూ... పార్టీలోనూ అంతా తానై చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పూర్వాశ్రమంలో జగన్ పత్రికలో కీలక పదవులు నిర్వహించిన వారే. ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకాలేమిటని హైకోర్టు మొట్టికాయలేసినా, ఎన్నోసార్లు తీవ్రస్థాయిలో అభిశంసించినా జగన్ సర్కారు తీరు మారలేదు. ప్రభుత్వ శాఖల్లో ఇష్టారాజ్యంగా సలహాదారుల్ని నియమించడంపై.. హైకోర్టులో ఇప్పటికే విచారణ సాగుతోంది. వారి నియామకాలపై న్యాయస్థానం ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. సలహాదారులు రాజ్యాంగేతరశక్తుల్లా వ్యవహరిస్తున్నారని, ఇది సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయినా జగన్ ప్రభుత్వం.. వాటిని ఎంత మాత్రం పట్టించుకోలేదు. మనవాళ్లైతే చాలు సలహాదారులుగా నియమించేద్దాం అనే ధోరణిలోనే.. పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది జగన్ సర్కార్. జీతాలు పెంచమని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ... జీతాలు పెంచేదే లేదంటూ... తాళాలు పగలగొట్టి మరీ అంగన్వాడీ కేంద్రాల్ని స్వాదీనం చేసుకుంటోంది. అదే సలహాదారులకైతే ప్రతి నెలా రూ.2లక్షల జీతంతో పాటు ఇతర అలవెన్సులు... వారి దగ్గర పనిచేసే సిబ్బందికి జీత భత్యాలకు రూ.3.82 లక్షల వరకు జగన్ సర్కార్ చెల్లిస్తోంది. సగటున 5 లక్షల ప్రకారం చూసినా... 50 మంది సలహాదారులకు నెలకు రూ.2.50 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో నెలనెలా సలహాదారులకు చెల్లిస్తున్న జగన్ ... ఈ ప్రభుత్వం నీ జాగీర్దారా అని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos