కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం మరింత ముదురుతోంది. తమిళనాడుకి నీళ్లు ఇచ్చేదే లేదని పట్టుబడుతోంది కర్ణాటక. రాష్ట్ర అవసరాలు తీర్చుకోవడానికే సరిపోవడం లేదని... వాటిని ఆ రాష్ట్రానికి విడుదల చేస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని వాదిస్తోంది. ఈ వివాదంపై రెండు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. కర్ణాటక ఆందోళనకారులంతా బంద్ చేస్తున్నారు.
కన్నడ సంస్థలకు చెందిన ఆందోళనకారులు పలుచోట్ల తమిళనాడుకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బంద్ కారణంగా ప్రజా రవాణాకి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లు, క్యాబ్‌లు, ఆటోలు తిరగడం లేదు. హోటల్స్, స్కూల్స్, కాలేజీలూ బంద్ అయ్యాయి. బెంగళూరుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు జరుగుతున్నాయి. థియేటర్లూ బంద్ అయ్యాయి. పలుచోట్ల రహదారులను నిరసనకారులు అడ్డగించారు. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం వద్దకు చేరుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు. తమిళనాడుతో సరిహద్దులు పంచుకునే ప్రాంతాల్లో పోలీసులు భారీభద్రత ఏర్పాటు చేశారు.
బంద్ కారణంగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 44 ఫ్లైట్స్ రద్దయ్యాయి. కన్నడ సంస్థ ఒక్కుట పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా ఫ్లైట్ సర్వీస్‌లను రద్దుచేశారు. అయితే ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మాత్రం అందుకు వేరే కారణం చెబుతోంది. ఆపరేషనల్ రీజన్స్ వల్ల విమానాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
ఎయిర్‌పోర్ట్ వద్ద నిరసనలు చేపట్టిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురూ ఎయిర్‌పోర్ట్‌లో ఎంట్రీ కోసం టికెట్‌లు కూడా బుక్ చేసుకున్నారు. ఆసాకుతో లోపలికి వచ్చి ఆందోళన చేశారు. ఇదిలావుండగా... తమిళనాడు, కర్ణాటక మధ్య 200 ఏళ్లుగా కావేరీ నదీజలాల వివాదం కొనసాగుతోంది. 2018లో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. కర్ణాటకకు అదనంగా 14.75 టీఎంసీల నీళ్లు విడుదల చేయాలని ఆదేశించింది. తమిళనాడు వాటాని అదే స్థాయిలో తగ్గించింది. బెంగళూరు సిటీలో తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు ఉన్న ఒకే ఒక ఆధారం ఈ కావేరి నదీ జలాలే.
కర్ణాటకలోని మాండ్యలో వ్యవసాయ భూములకూ ఈ నీరే ఆధారం. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య తరచూ వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఇది బయటపడింది. ఈ వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని పరిష్కరించాలని కర్ణాటక రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos