తెలంగాణ బీజేపీ కీలక నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పార్టీ హైకమాండ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలను అప్పగిస్తూ పార్టీలో ప్రాధాన్యత కల్పించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించిన తర్వాత ఆయన అనుచరులు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ కీలక నేతలు కొందరు ఈ విషయంపై తమ అసహనాన్ని సైతం వ్యక్తం చేశారు. తాజాగా సంజయ్ కు జాతీయ స్థాయిలో బాధ్యతలను అప్పగించడంపై వీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఆయన చేస్తున్న సేవలకు మంచి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా... బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సత్య కుమార్ కు జాతీయ కార్యదర్శిగా మరోసారి అవకాశం కల్పించింది.  వాస్తవంగా... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేసినప్పటి నుంచే ... ఆయన పదవికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి. బండి సంజయ్‌ సేవలను వినియోగించుకోవడానికి కేంద్ర నాయకత్వం ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించడమో లేక జాతీయ కార్యదర్శిగా నియమించి కొన్ని రాష్ర్టాలకు బాధ్యులుగా పంపించే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.

ఒకే వ్యక్తికి ఒకే పదవి అన్న కారణంతో కేంద్ర మంత్రి పదవికి కిషన్‌రెడ్డి రాజీనామా చేయాల్సి ఉంది. ఆయన రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. దీంతో ఆయన స్థానంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బండి సంజయ్‌‌కు అవకాశం కల్పిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ తాజాగా బండి సంజయ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జాబితాలో 13 మందిని ఉపాధ్యక్షులుగా, తొమ్మిది మందిని ప్రధాన కార్యదర్శులను నియమించారు.  బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాష్‌లను కొనసాగించారు. బీజేపీ జాతీయ కార్యదర్శులుగా 13 మందికి చోటుకల్పించారు.  బీజేపీ కొత్త ప్రధాన కార్యదర్శుల జాబితాలో బండి సంజయ్‌తో పాటు రాజ్యసభ ఎంపీ రాధామోహన్ అగర్వాల్ కూడా ఉన్నారు. ఇక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాంలలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. బీజేపీ తన జాతీయ కమిటీలో ఈ మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos