హైదరాబాద్ లో అత్యంత ఉత్సాహకర వాతావరణంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు రేపు గణపయ్య నిమజ్జనంతో ముగియనున్నాయి. ఈసారి ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 63 అడుగుల మహాగణపతి కూడా రేపు సాగర్‌లో నిమజ్జనం కానున్నాడు. ఖైరతాబాద్‌లో దశ మహావిద్యాగణపతికి వీడ్కోలు పలికేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 11గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరుగుతుందని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రకటించింది.
ఉదయం 7గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా శోభాయాత్ర సాగుతుంది. నెమ్మదిగా కదులుతూ ఉదయం తొమ్మిదున్నర గంటలకు బడా గణపయ్య ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటాడు. ఆ తర్వాత 11గంటల వరకు పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. 11గంటల 30 నిమిషాలకు ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. దీంతో శ్రీ దశ మహా విద్యా గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణనాధుడి నిమజ్జన ప్రక్రియ పూర్తవుతుంది. రేపటి నిమజ్జనానికి ఈ సాయంత్రం నుంచే ఏర్పాట్లు మొదలుపెడుతున్న కారణంగా... ఈ సాయంత్రం నుంచి ఖైరతాబాద్ గణపయ్య దర్శనాలు నిలిపివేస్తున్నారు.
స్వామివారి విగ్రహాల నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్‌తోపాటు ప్రధాన చెరువుల దగ్గర ఏర్పాట్లు చేశారు. గ్రేటర్‌లో ఈసారి 90 వేల గణేష్ విగ్రహాలు ఏర్పాటుకాగా.. ట్యాంక్ బండ్‌లో 30 వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. నిమజ్జనానికి సంబంధించి... భద్రతాపరంగా అన్నిఏర్పాట్లు చేశారు. అడుగడుగునా నిఘాతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు... శాంతిభద్రతలకు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేశారు. శోభాయాత్ర జరిగే మార్గాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో పెట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఖైరతాబాద్ లోని బడా గణేష్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 35 వేల మంది పోలీసుతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos