తిరుమలలో చిరుత దాడితో కలకలం రేగింది. అలిపిరి కాలినడక మార్గంలో వెళుతున్న లక్షిత అనే ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది. శుక్రవారం ఈ దారుణం వెలుగు చూసింది. రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి లక్షితతో కలిసి కుటుంబసభ్యులు శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న బాలికపై అకస్మాత్తుగా ఓ చిరుత దాడి చేసింది. దీంతో, కుటుంబసభ్యులు కేకలు వేయడంతో బాలికను అడవిలోకి లాక్కెళ్లిపోయింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో గాలింపు చర్యలు కుదరకపోవడంతో పోలీసులు ఉదయం వెతుకుతుండగా బాలిక మృతదేహం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొద్ది దూరంలో కనిపించింది. బాలిక మృతదేహాన్ని చిరుత సగం తిన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల స్వస్థలం నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెమని వారు తెలిపారు. ఇది.. ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలిసిన వార్తా సమాచారం. కానీ... లక్షిత మృత్యువుకు సంబంధించి అటవీశాఖ ఉన్నతాధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. పాపను చంపేసింది చిరుత కాదని ... ఎలుగుబంటి అని వారు వివరించారు. పాపపై దాడి జరిగిన ప్రదేశం, గాయాలు చూస్తుంటే అదే అనుమానం బలపడుతోందని వారు అన్నారు. ఆ చిన్నారి ఎలుగుబంటి దాడిలో చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని చెబుతున్నారు. బంధువులు, తల్లిదండ్రులకు దూరంగా పాప ఒక్కతే ... మెట్ల మార్గంలో కాకుండా కాస్త పక్కన నడుస్తూ వెళతున్న సమయంలో ... చిన్నారిని ఎలుగుబంటి లాక్కెళ్లిపోయిందని అంటున్నారు. పాప మృతదేహం లభించిన ప్లేస్‌లో ఆనవాళ్ళు చూశామని.. ఎలుగుబంటి దాడి చేసినట్టుగా అనుమానిస్తున్నామని వారు వివరిస్తున్నారు. సీసీ కెమెరాలోని విజువల్స్ తో పాటు.. పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించాక క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. తిరుమలకు కాలినడక మార్గంలో వెళుతున్నప్పుడు చిన్నారుల తల్లిదండ్రులు వారి పట్ల కేర్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత జూన్ 11న కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగిందని... అప్పుడు కూడా ఓ బాలుడిపై ఇలాగే చిరుత దాడి చేసిందని... అయితే... ఆ ఘటనలో బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడని వారు చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos