టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి కోర్టు వెళ్లారు. ఒక కేసు విషయమై న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. తనపై అసత్య ఆరోపణలు చేసి, తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన వైసీపీ నేతలు పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ ... కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టీడీపీ హాయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని, నిధులు దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ ఈ కేసును దర్యాప్తు చేసిన అనంతరం పలువురిని అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ కూడా రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. సిమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్‌తో పాటు చార్టెడ్ అకౌంటెంట్ ముకుల్ చంద్ర అగల్వార్, సురేష్ గోయల్, కన్విల్కర్లను ఈడీ అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత వారందరూ బెయిల్‌పై బయటకొచ్చారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఈ స్కాం చోటుచేసుకోవడం, అప్పట్లో లోకేష్ మంత్రిగా ఉండటంతో ఇందులో లోకేష్ హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకురాలు పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తనపై చేస్తున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని గతంలో కోర్టును లోకేష్ ఆశ్రయించారు. అలాగే చినబాబు చిరు తిండి పేరుతో సాక్షి వేసిన కథనంపై మంగళగిరితో పాటు విశాఖ కోర్టులో మరో పరువు నష్టం దావాలు వేసి... లోకేశ్ న్యాయపోరాటం చేస్తున్నారు. కాగా... లోకేష్ కోర్టుకు రావడంతో ... అక్కడికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో కోర్టు వద్ద సందడి నెలకొంది. పోలీసులు కూడా కోర్టు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ లోకేష్ కోర్టు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. ఇదిలావుండగా... మంగళగిరి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రకు శుక్రవారం వరకు విరామం ఇచ్చారు. శనివారం నుంచి లోకేశ్ పాదయాత్ర యధావిధిగా సాగనుంది. లోకేష్ ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos