టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అరెస్ట్ కావడం, విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపించడం వంటి ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు వస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటిపై నారా లోకేశ్ స్పందించారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ సుదీర్ఘమైన పోస్ట్ రాశారు. బాధ, బరువెక్కిన హృదయం, కన్నీళ్లతో రాస్తున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం నాన్న తన జీవితాన్ని ధారపోశారని గుర్తు చేశారు. ఆ త్యాగాలను నేను చూస్తూ పెరిగానని ... లక్షలాది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు విశ్రాంతి అనేది తెలియదని... ఆయన రాజకీయాలు ఎల్లప్పుడూ గౌరవం, నిజాయితీతో ఇమిడి ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు. ఆయన ప్రేమ, సేవను చూసి ఎంతోమంది ప్రేరణ పొందారని, నేను కూడా ఆయన గొప్ప మార్గం నుండి ప్రేరణ పొందానని, ఆయన అడుగుజాడలను అనుసరించానని అన్నారు. అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చానని, ఇది చాలా కఠినమైన నిర్ణయమని... కానీ నాకు మన దేశం, మన వ్యవస్థలు, మన పునాది సూత్రాలు, అన్నింటికంటే మించి మన రాజ్యాంగంపై నమ్మకం ఉందని అన్నారు. అయినప్పటికీ.. చేయని నేరానికి మా నాన్న అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే.. నా కోపం కట్టలు తెంచుకుంటోందని... రక్తం ఉడికిపోతోందని అన్నారు. రాజకీయంగా పగ, ప్రతీకారాలను తీర్చుకోవడానికి ఒక హద్దు అనేది ఉంటుందని, జగన్ ప్రభుత్వం ఈ హద్దును దాటిందని పేర్కొన్నారు. దేశం, రాష్ట్రం, తెలుగు ప్రజల కోసం ఎంతో చేసిన చంద్రబాబు ఈ అన్యాయాన్ని ఎందుకు భరించాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ పగ, విధ్వంసకర రాజకీయాలకు పాల్పడలేదని ... అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన చంద్రబాబును ఇప్పుడు జైలుకు పంపారని.. ఇదంతా ఓ నమ్మకద్రోహంలా అనిపిస్తోందని లోకేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఓ పోరాట యోధుడని ... ఏపీలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్పంతో నేను కూడా ప్రజా పోరాటానికి దిగుతున్నానని... తిరుగులేని శక్తితో మళ్లీ ఎదుగుతామంటూ నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలో నాతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos