నందమూరి కుటుంబంలో పెళ్లి సందడి జరిగింది. దివంగత సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తనయుడైన వెంకట శ్రీహర్ష వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో కుటుంబసభ్యులతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తమ సోదరి కొడుకు పెళ్లి వేడుక కావడంతో జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అన్నీ తామై పెళ్లి వేడుకని ముందుండి చూసుకున్నారు. గచ్చిబౌలిలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో నందమూరి కుటుంబసభ్యులందరూ సందడి చేశారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ప్రముఖ సినీటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా ఈ పెళ్లి వేడుకలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఈ జనరేషన్ నందమూరి సోదరులు ఒకే ఫ్రేములో కనిపించడంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు. ముఖ్యంగా జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఒకే దగ్గర చేరి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్.. ఈ దృశ్యాలు చూసి పండగ చేసుకుంటున్నారు. తన సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కలసి మోక్షజ్ఞ టైం స్పెండ్ చేయడం ఫ్యాన్స్ కి తెగ సంతోషాన్ని ఇచ్చింది. చాలాకాలం నుంచి ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీతో ముఖ్యంగా బాలయ్య తో సంబంధాలు సరిగా లేవనే రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ ని బాలయ్య దూరం పెడుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారమే సాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, మోక్షజ్ఞ కలసి కనిపించడంతో రూమర్స్ కి చెక్ పడింది. ఇదిలావుండగా, రెండ్రోజుల క్రితం ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహ వేడుక వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అటు రాజకీయ, ఇటు సినీ అభిమానులు పెళ్లిళ్ల సందళ్లతో ఖుషీఖుషీగా గడిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos