ఏపీలో వైసీపీ ప్రభుత్వం వరుసగా ఐదోసారి రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఎన్నికల ఏడాది కావడంతో కేవలం నాలుగు నెలల కోసం ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.86 లక్షల వ్యయ అంచనాలతో ఈ బడ్జెట్ ను రూపొందించారు. అయితే నాలుగు నెలల కోసం రూ.88,215 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ముఖ్యమంత్రి జగన్ ... చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్నీ విస్మరించకూడదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపొందించామని అన్నారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో 7 విధానాలు అనుసరించామని ... ఇందులో సుపరిపాలన, సామర్థ్య, మహిళా మహారాణులు, అన్నపూర్ణ, సంక్షేమ, సంపన్న, భూభద్ర - ఆంధ్ర విధానాలతో ముందుకు నడిచామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం లో మొదటి నాలుగు నెలల అవసరాల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనల్ని ఆర్ధిక మంత్రి సభ ముందుంచారు. వచ్చే ఏప్రిల్, మే, జూన్, జులై నెలల కోసం రూ.88,215 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు చేశారు. ఎన్నికల తర్వాత మరోసారి బడ్జెట్ సమావేశం నిర్వహించి... మిగిలిన ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. ఆ లోపు ఓటాన్ అకౌంట్ లో ఆమోదించిన మేరకు ఖర్చు చేసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos