ఏపీలో జనసేనాని పవన్ కళ్యాణ్ ... రెండోవిడత వారాహి యాత్ర సందర్భంగా ఏలూరులో ... వాలంటీర్లపై చేసిన ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించిన వ్యాఖ్యలు ఇప్పటికీ తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కామెంట్స్ పై వాలంటీర్లు ఆగ్రహించి నిరసనలు చేపట్టడం... ఆయన దిష్టిబొమ్మలను దహనం చేయడం తెలిసిందే. వైసీపీ నేతలు కూడా పవన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో... మహిళలు, బాలికల అదృశ్యంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా.. మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఏపీలో 30,198 మంది మహిళలు, బాలికలు అదృశ్యమైనట్లు పార్లమెంటులో కేంద్రమంత్రి ప్రకటించారని, దీనిపై ఏపీ మహిళా కమిషన్ బహిరంగంగా మాట్లాడగలదా... అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వాన్ని మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందా... అని అన్నారు. మహిళలు, బాలికల అదృశ్యంపై జగన్ సర్కార్ ఇప్పుడేం చెబుతుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీలో మహిళలు, బాలికల మిస్సింగ్ కు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఇచ్చిన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వ పెద్దలు చదువుకోవాలని జనసేన అధికారిక ప్రకటనలో సూచించింది.
2019 నుండి 2021 మధ్య మూడేళ్ల కాలంలో 30వేల మందికి పైగా అదృశ్యమైనట్లు స్వయంగా కేంద్రమంత్రి పార్లమెంట్ లో చెప్పారని ఆ పార్టీ వెల్లడించింది. ఇదే విషయాన్ని పవన్ తన వారాహి యాత్రలో చెప్పారని, జగన్ ప్రభుత్వంలోని మంత్రుల నుండి పోలీసు ఉన్నతాధికారుల వరకు ఈ వాస్తవాలపై అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాక్ట్ చెక్ పేరుతో తప్పుడు లెక్కలు చూపించి మసిపూసి మారేడు కాయ చేసిన అధికార యంత్రాంగం ఇప్పుడు కేంద్రం లెక్కలు ఇచ్చాక ... ఏం చెబుతుందని ప్రశ్నించింది.
కేంద్ర హోంశాఖ ఇచ్చిన గణాంకాలను జగన్ ప్రభుత్వం తప్పుపడుతుందా... ఆ లెక్కలను విమర్శిస్తూ ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఏమైనా చెబుతుందా... అని జనసేన ప్రశ్నించింది. ఏపీలో మహిళలు, బాలికల అదృశ్యం సమస్య ఎంత తీవ్రంగా ఉందో పవన్ గ్రహించారని తెలిపింది. ఆ తీవ్రత నేపథ్యంలోనే గణాంకాల ఆధారంగా తెలియజేస్తూ పవన్ ప్రసంగించారని పేర్కొంది. వాస్తవాలను అంగీకరించలేని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందన్నారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ సభ్యత మరిచిపోయి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారని పేర్కొంది. ఇకనైనా ప్రభుత్వం మహిళలు, బాలికల రక్షణపై దృష్టి పెట్టాలని సూచించింది.
ఈ క్రమంలో... ఏపీలో మహిళల అదృశ్యంపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ముప్పై వేల మంది మిస్సింగ్ అయింది అవాస్తవమని ... ఆరోపణలు చేసే ముందు నివేదికలు చూసి మాట్లాడాలని డీజీపీ అన్నారు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 26వేల మంది మిస్ అయినట్లు నివేదికలు చెబుతున్నాయని... అదృశ్యం అయిన మహిళలు 2,700 మంది మాత్రమేనని...వారిని కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. మిస్సింగ్ అయిన వారిలో 23,354 మందిని గుర్తించామని వెల్లడించారు. వివిధ కారణాల రీత్యా మిస్సింగ్ అయ్యారని... బాధితుల కేసులు నమోదు అవుతున్నాయని డీజీపీ క్లారిటీ ఇచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos