టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా... ఉండదా... అనేది ఏపీ రాజకీయాల్లో పెద్ద మిస్టరీగా తయారైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ... వారాహి యాత్రలో పలురకాలుగా రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తుండటంతో అన్నిపార్టీల్లోనూ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజకీయ పొత్తులపైన పవన్ తరచుగా స్వరం మార్చుతుండటం దేనికి సంకేతమని... ఇది ఆయన పొలిటికల్ స్ట్రాటజీనేనా అని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
నేనే సీఎంను అవుతానని... ఇందుకుగాను అందరూ మద్దతుగా నిలవాలని వారాహి యాత్రలో పవన్ కోరటంతో ... పొత్తులపైన పలు సందేహాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడనివ్వకూడదనేదే తన ఉద్దేశం అని చెబుతూనే కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ పోటీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. తెలంగాణలో పోటీ సంగతి కాసేపు పక్కన పెడితే... వారాహి యాత్రలో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్ కీలక అంశాలను ప్రస్తావించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలనేది తన అభిప్రాయమని స్పష్టం చేశారు. అది ఏ స్థాయిలో ఎలా అనేది తానొక్కడినే ప్రతిపాదించేది కాదని ... అన్నిపార్టీల నుంచి ఏకాభిప్రాయం రావాలని... అయితే ఏకాభిప్రాయం కుదరడం కొంత కష్టసాధ్యమైన విషయమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు దగ్గరపడ్డాక పొత్తులపై మరింత స్పష్టత వస్తుందని చెప్పటం ద్వారా మరింత ఆసక్తిని పెంచారు. చంద్రబాబును మూడుసార్లు కలిశానని.. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత పొత్తుల విషయంలో మరింత స్పష్టత వస్తుందన్నారు. పవన్ మాటల్ని చూస్తే.. పొత్తుల మీద తాను మాత్రమే కాదు.. మిగిలిన భాగస్వామ్య పార్టీల నుంచి కూడా తాను కోరుకుంటున్న స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది.
పొత్తులపై ఇప్పటివరకు పవన్ కల్యాణ్ పలుమార్లు మాట్లాడటం... ఆ సందర్భంగా పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు అన్న దగ్గర... టీడీపీ సానుభూతిపరుల నుంచి వచ్చే వ్యాఖ్యలు పవన్ ను ఇబ్బంది పెట్టేలా ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు పొత్తుల విషయంపై పవన్ పదే పదే ప్రస్తావించటం ద్వారా.. బేరమాడే శక్తిని కోల్పోతారన్న కొత్త వాదన తెర మీదకు వచ్చింది. అందుకే.. పొత్తులపై తన అంతరార్థం ముందుగా బయటపడకూడదన్న భావనలో పవన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పొత్తులను డిసైడ్ చేసేది నేను ఒక్కడినే కాదంటున్న పవన్.. మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీ నుంచే తొలుత ఆ ప్రస్తావన రావాలని కోరుకుంటున్నారని అర్థమవుతోంది. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ ... టీడీపీని కూడా కలుపుకుని పోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ.... బీజేపీ సహకరించడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఆ రెండు పార్టీల ఏకాభిప్రాయం కోసం పవన్ తాపత్రయపడుతున్నారు. మొత్తానికి పొత్తుల పై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉత్కంఠను పెంచుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos