విజనరీగా పేరున్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు... రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేయాలని సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ప్రజలకు చేసిందేంటి.. ఏయే రంగంలో ఏ మాత్రం ఒరగబెట్టింది.. ఎంత అప్పు చేసింది.. సాగునీ ప్రాజెక్టుల పరిస్థితేంటి.. ఇలా అన్ని విషయాలను చంద్రబాబు ఏపీ ప్రజానీకానికి హైటెక్ పద్ధతిలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించడం ప్రారంభించారు.
ఆగస్టు1 నుంచి ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు చంద్రబాబు సిద్ధమయ్యారు. 'పెన్నా టు వంశధార' పేరుతో ఆగస్టు 1 నుంచి 10 రోజుల పాటు ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ‘తెలుగు నేలకు జలహారం’ పేరుతో ‘పెన్నా టు వంశధార’ వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. ప్రాజెక్టుల సందర్శనకు రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదలయ్యే పర్యటనలో... మచ్చుమర్రి, బంకచర్ల ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శించనున్నారు. అదే రోజు నందికొట్కూరులో రోడ్ షో, బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఆగస్టు 2వ తేదీన కొండాపురం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అదేరోజు పులివెందులలో రోడ్ షో, పూల అంగళ్ల సర్కిల్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆగస్టు 3న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, గొల్లపల్లి రిజర్వాయర్‌లను సందర్శిస్తారు. అదే రోజు పెనుగొండ పరిధిలోని కియా కార్ల ఫ్యాక్టరీని సందర్శించనున్నారు.
అదేవిధంగా చంద్రబాబు ఆగస్టు 4వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు బ్రాంచ్ కెనాల్ ను సందర్శించనున్నారు. పూతలపట్టులో రోడ్ షో, అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. వైసీపీ ప్రభుత్వంలో మొత్తం 198 ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రీక్లోజర్ చేస్తే అందులో 96 ప్రాజెక్టులు కోస్తాంధ్రలో ఉన్నాయి. ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజ్ కూడా పెట్టడం లేదు.
ఏపీలోని 69 నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేస్తే, నీటి సమస్యే ఉండదని... ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రధాన నదులున్నాయని.. వీటితో పాటు అనేక ఉపనదులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టామని గుర్తు చేశారు. వంశధార-గోదావరి నదులను అనుసంధానం చేసే అవకాశం ఉందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్నారు. కోస్తాంధ్ర ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వంలో రూ.21,442 కోట్లు ఖర్చు పెడితే, వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.4,375 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని విమర్శించారు. టీడీపీ హయాంలో మొత్తం 64 ప్రాజెక్టులు మొదలు పెట్టి 23 పూర్తి చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 4 శాతం ప్రాజెక్టుల పనులు చేసిందని విమర్శించారు.
కాగా... ఈ జలహారం యాత్ర కర్నూలు జిల్లాలో మొదలై శ్రీకాకుళం వరకు సాగనున్నది. ఇరిగేషన్ రంగాన్ని, ప్రాజెక్టులను జగన్ ఏవిధంగా భ్రష్టు పట్టించారనే విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నది చంద్రబాబు యోచనగా ఉంది. కేవలం నీటి ప్రాజెక్టులే కాదు... అన్ని రంగాల విషయంలోనూ జగన్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి మరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos