ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా లేఖ రాశారు. విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సత్య వెంకట హిమబిందుకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న అసత్య, అసభ్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు విచారిస్తున్నారు. అయితే చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ జడ్జి హిమబిందు ఉత్తర్వులు వెలువరించిన తర్వాత ఆమెను కించపరుస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని కొందరు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. జడ్జి హిమబిందుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టుల వల్ల ఆమె హోదా, గౌరవాన్ని కించపరిచినట్టుగా అవుతుందని రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. బాధ్యతయుతంగా విధులు నిర్వర్తిస్తున్న జడ్జి వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని.. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా ఆ ఫిర్యాదులపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ ను రాష్ట్రపతి కార్యదర్శి పీసీ మీనా ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడికి వివరించాలని లేఖ రాశారు. ఇదిలావుండగా... ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమబిందుకు భద్రతను పెంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కూడా అదనపు భద్రత కల్పించారు. ఇదిలావుండగా... జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను పశ్చిమ గోదావరి జిల్లా గౌడ సమస్య సంఘం నాయకులు కూడా ఖండించారు. న్యాయపరంగా తీర్పు ఇచ్చిన జడ్జిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా వస్తున్న పోస్ట్‌ల ను గుర్తించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. కోర్టులలో న్యాయం జరగకపోతే కత్తి పట్టుకుని యుద్ధం చేయాలని ప్రముఖ లాయర్ చేసిన ట్వీట్ పై కూడా వారు మండిపడుతున్నారు. బాధ్యతాయుత లాయర్ వృత్తిలో ఉంటూ... హింసను ప్రేరేపించేలా ఆ లాయర్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని... ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos