ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్ల వ్యవహారంపై పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గళం విప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధివిధానాల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఏపీలో ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం ఈసీ ప్రధాన విధి అని ... కానీ, రాష్ట్రంలో ఆ విధమైన పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని... ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించే విషయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలను డీఆర్వోలు, స్థానిక సిబ్బంది ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని ... ఒత్తిళ్లకు లొంగి జాబితాలో మార్పులు చేస్తున్నారని అన్నారు. ఓట్లర్ల లిస్టులో అధికారులు మార్పులు చేస్తున్న విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు కూడా చేశారని... ఓటర్ల జాబితా నుంచి టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారనే ఫిర్యాదులో ఆధారాలతో సహా వివరించారని గల్లా జయదేవ్ అన్నారు. ఏపీలో ఎన్నికల అక్రమాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. వెంటనే స్థానికులతో సంబంధం లేని అధికారుల పర్యవేక్షణలో ఓటర్ల జాబితా రూపొందించడంపై దృష్టి సారించాలని.. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయంటే.. కింది స్థాయి అధికారులపైకి ఉన్నతాధికారులు నెపం నెట్టేస్తున్నారని అన్నారు. సుమారు 10 లక్షల ఫిర్యాదులు చేసినా.. వాటిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుది ముసాయిదా జాబితా విడుదల చేసిన సందర్భంలో 13 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించినట్లు ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. దొంగ ఓట్లు ఉన్నాయని అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా.. అందుకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించే విదంగా చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos