టీడీపీ నేత వంగవీటి రాధా తల్లి, దివంగత వంగవీటి రంగా సతీమణి రత్నకుమారి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. వెంటనే ఆమెను విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన రంగా అభిమానులు భారీ ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. గతంలో వంగవీటి రంగాతో పెళ్లి తర్వాత ఇంటిపట్టునే ఉన్న రత్నకుమారి ఆయన హత్య తర్వాత రాజకీయ తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో 1989లో తొలిసారి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు. ఇటీవల కుమారుడు వంగవీటి రాధా పెళ్లిలో కనిపించిన ఆమె.. ఇప్పుడు అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వంగవీటి రంగా అభిమానులు ఈ వార్త తెలియగానే భారీ ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చి ఆమెను పరామర్శిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos