టాలీవుడ్ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆకస్మిక మృతితో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన వారం రోజుల క్రితం విశాఖపట్నంలో షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకున్న ఆయన ... సడెన్ గా అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు కావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.
కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యూట్యూబ్ లో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఆట డ్యాన్స్ షోతో డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన రాకేష్ మాస్టర్.. 1400 పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. తన కెరీర్ ను చాలామంది డ్యాన్స్ మాస్టర్లు నాశనం చేశారని ఆరోపిస్తూ యూట్యూబ్ లో ఓ వీడియో వదిలి రాకేష్ మాస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.
కొంతమంది యువ హీరోల సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఈటీవీ, జీతెలుగు వంటి ఛానల్స్ లో ప్రసారమైన రియాల్టీ షోలలో కూడా ఆయన వర్క్ చేశారు. తిరుపతిలో 1968లో జన్మించిన రాకేష్ మాస్టర్ బాల్యదశ అంతా అక్కడే గడిపారు. యుక్త వయసులోకి రాకముందే డ్యాన్స్ మాస్టర్ గా గుర్తింపును అందుకోవాలని ఎంతగానో హార్డ్ వర్క్ చేశారు. మొదట చెన్నైలో ఒక డ్యాన్సర్ గా కొనసాగిన రాకేష్ మాస్టర్ ... ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ స్కూల్ ని కూడా ప్రారంభించారు. చాలామంది ప్రముఖుల పిల్లలకు ఆయన డ్యాన్స్ నేర్పించారు.
ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి సినిమాలకు తరచుగా కొరియోగ్రఫీ చేస్తూ ఉండేవారు. దేవదాసు, లాహిరి లాహిరిలో.., సీతయ్య వంటి సినిమాలకు కూడా వర్క్ చేసిన రాకేష్ మాస్టర్ మంచి గుర్తింపును అందుకున్నారు. ఆ తరువాత మరి కొంతమంది ప్రముఖ హీరోల సినిమాల పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్న శేఖర్ మాస్టర్ ... రాకేష్ మాస్టర్ శిష్యుడే. రాకేష్ మాస్టర్ టెలివిజన్ ప్రపంచంలో కూడా అందరికీ తెలిసిన వారే. ఆట షోలో చాలాకాలం పాటు ఆయన జడ్జిగా కొనసాగారు.
అంతేకాకుండా ఈటీవీలో వచ్చే ఢీ షోలో కూడా రాకేష్ మాస్టర్ జడ్జిగా కనిపించారు. జబర్దస్త్ షోలో పలు ఎపిసోడ్స్ లో కనిపించిన రాకేష్ మాస్టర్ అనంతరం సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్థాపించి అందులో వివిధ రకాల వీడియోలు పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు. రాకేష్ మాస్టర్ మరణంపై పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos