ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. తమ వాహనాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ ను స్మగ్లింగ్ ముఠా పొట్టనపెట్టుకుంది. ఈ దారుణం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. శేషాచలం అడవుల నుంచి ఒక స్మగ్లింగ్ ముఠా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు సుండుపల్లి సమీపంలోని గొల్లపల్లి చెరువు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఇదే సమయంలో అటువైపు వేగంగా దూసుకొస్తున్న కారును కానిస్టేబుల్ గణేష్ ఆపేందుకు ప్రయత్నించగా... ఆ కారులో ఎర్రచందనం దుంగలు ఉండటంతో పట్టుబడతామని గ్రహించిన స్మగ్లర్లు బరితెగించారు. అదే వేగంతో కానిస్టేబుల్ పైకి కారును పోనిచ్చి ఢీకొనడంతో గణేష్ అక్కడికక్కడే కుప్పకూలి పోగా స్మగ్లర్లు పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ను పీలేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు ఎర్రచందనం తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా... ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గణేశ్ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై మెరుపుదాడులకు పాల్పడి... కానిస్టేబుల్ గణేష్ ని చంపేయ‌టం రాష్ట్రంలో వైసీపీ ఎర్ర చందనం మాఫియా దారుణాల‌కు ప‌రాకాష్ఠ అని ధ్వజమెత్తారు. జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైంది. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి... అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ప్లానింగ్ తో వైసీపీ ... ఎర్ర చందనం మాఫియా అవతారం ఎత్తిందని... ఎర్రచందనం స్మగ్లర్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన జగన్ ఎర్ర చందనం స్మగ్లింగ్ కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాడని... అడ్డొచ్చిన పోలీసుల్ని వైసీపీ ఎర్ర చందనం మాఫియా చంపేస్తోందని విమర్శించారు. మృతి చెందిన కానిస్టేబుల్ గ‌ణేష్ కి నివాళులు అర్పిస్తూ... మృతుని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నానని అన్నారు. గ‌ణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని... గణేష్ ప్రాణాలు బలిగొన్న ఎర్ర చందనం మాఫియాను కఠినంగా శిక్షించాలంటూ నారా లోకేష్ డిమాండ్ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos