తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడిన తరువాత మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరిగాయి. పోలింగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు నాగార్జునసాగర్ డ్యాం దగ్గర అర్థరాత్రి హైడ్రామా నడిచింది. ఒక్కసారిగా ఏపీకి చెందిన 700 మందికి పైగా పోలీసులు డ్యాం మీదికి వచ్చి... వారి భూభాగంలోని 13 గేట్ల పరిధిని ఆక్రమించుకున్నారు. ఆ తరువాత ఏపీ ఇరిగేషన్ అధికారులు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బుధవారం అర్థరాత్రి మొదలైన ఈ ఉద్రిక్తతలు శుక్రవారం వరకూ కొనసాగాయి. అసలు ఈ కృష్ణానదీ జలాల వివాదం ఎందుకొచ్చిందనేది తెలుసుకోవాల్సి ఉంది. మహారాష్ట్రలో పుట్టిన కృష్ణా నది దాదాపు 1300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో పుట్టి అక్కడి నుంచి కర్ణాటకకు... తరువాత తెలంగాణ కు.. ఆ తర్వాత ఏపీలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలోని అలంపూర్ నుంచి ఏపీలోని ముత్యాల గ్రామం వరకు కృష్ణానది రెండు రాష్ట్రాలకు సరిహద్దు. ఇక చివరగా పూర్తిగా ఏపీలో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది.
ఏపీ- తెలంగాణ కలిసి ఉమ్మడిగా ఉన్న సమయంలో… కర్ణాటక, మహారాష్ట్రలతో ఈ కృష్ణా జలాల పంపిణీ మీద వివాదాలు ఉండేవి. ఆ సమయంలో కూడా ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి కృష్ణాజిల్లాలు అందడం లేదన్న వివాదం అంతర్గతంగా ఉండేది. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా.. ఏపీలోని రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఈ నీటి విషయంలో వివాదం ఉంది. తెలంగాణ, ఏపీలో కలిపి కృష్ణానది మీద శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయి. ఇవి కూడా కొంత భాగం తెలంగాణలో, కొంత భాగం ఏపీలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులను ఒకసారి పరిశీలిస్తే.. ఈ ప్రాజెక్టుల ఎగువ భాగంలో జూరాల ప్రాజెక్టు తెలంగాణలో ఉండగా.. దిగువ భాగంలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఏపీ భూభాగంలో ఉంది. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయానికొస్తే... సాగర్ కుడి కాలువ ద్వారా ప్రవహించే నీరు ఏపీకి, ఎడమకాలువ ద్వారా ప్రవహించే నీరు తెలంగాణకు చెందుతాయనేది తొలుత ఏర్పాటు చేసుకున్న ఒప్పందం. కానీ నిర్మాణం సమయంలో ఎడమ కాలువ కంటే కుడి కాలువ కాస్త తక్కువ ఎత్తులో నిర్మించడం వల్ల ఏపీకి ఎక్కువ నీరు పోయేలా మార్చుకున్నారని వివాదం. ఏ ప్రాజెక్టులోనూ 365 రోజులూ నీరు ఉండదు. అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కూడా తక్కువ నీరు ఉన్నప్పుడు ప్రాజెక్టు ఉన్న నల్గొండ ప్రాంతానికి నీరు ఆపి... కృష్ణా డెల్టాకు నీటి ఇబ్బంది రాకుండా పంపిణీ చేస్తున్నారని... వివక్షకు పాల్పడుతున్నారని తెలంగాణ రైతులు ఎప్పటినుంచో చేస్తున్న ఆరోపణ.ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఈ జలాల పంపిణీ విషయంలో పలుసార్లు గొడవలు వచ్చాయి. అధికారుల స్థాయిలో పరిష్కారాలు జరిగేవి. ఇంకా చెప్పాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సామరస్య ఒప్పందాల మేరకు నడిచిపోతున్నట్లుగా కనిపించేది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. తెలంగాణలో పదేళ్లుగా కొనసాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నార్థకంలో పడింది. ఇప్పటివరకు ఇంతస్థాయిలో దూకుడు చూపించని ఏపీ ప్రభుత్వం … ఇప్పుడు ఎందుకు నాగార్జునసాగర్ డ్యాం పై ముళ్లకంచెలు వేసి, 13 గేట్లను స్వాధీనం చేసుకుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు 2000 క్యూసెక్కుల నీటిని ఎలా విడుదల చేసుకున్నారని సాగునీటి విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి.. తెలంగాణ భవిష్యత్తును గందరగోళంగా మార్చడానికే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. నాగార్జున సాగర్ వివాదం చాలా ఏళ్లుగా ఉన్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వం ఇప్పుడే హఠాత్తుగా ఇలాంటి చర్యలకు పాల్పడడానికి కారణం ఏమిటి... ఎన్నికల రోజు వివాదానికి తెరలేపడం వెనక ఏదైనా కుట్రకోణం ఉందా... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనిశ్చితి క్రియేట్ చేయడానికా అనే సందేహాలు తలెత్తుతున్నాయని వారు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos