ఏపీలో సీఎం అనుచిత, అరాచక పాలన కారణంగా అన్నివర్గాల వారూ నరకయాతన అనుభవిస్తున్నారని ప్రజలు బావురుమంటున్నారు. జగన్ 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా... ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటోతేదీ నాటికి సక్రమంగా జీతాలు పంపిణీ చేయడం లేదంటూ వారు ఎప్పటి నుంచో తమ గోడు వెళ్లబోసుకుంటున్నా సీఎం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ వేధింపులు తాళలేక ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాసిన లేఖ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు మల్లేశ్ లేఖలో రాసిన వివరాలిలా ఉన్నాయి. ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేష్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు సీపీఎస్ రద్దు చేస్తానని జగన్ పదే పదే చెప్పిన మాటలను ఆయన బలంగా నమ్మారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ ను ఈ ఏడాది... వచ్చే ఏడాది.. అంటూ ఇలా ఎప్పటికప్పుడు రద్దు చేస్తారంటూ పందేలు కాస్తూ వచ్చారు. అది జరగకపోవడంతో మల్లేష్ రూ.లక్షలు పోగొట్టుకున్నారు. కుటుంబ పోషణకు, రుణాలను చెల్లించడానికి చిట్టీలు వేయడంతో పాటు బ్యాంక్, యాప్ రుణాలు తీసుకున్నారు. సీపీఎస్ రద్దు కాకపోవడం, నెలనెలా వేతనాలు సక్రమంగా అందకపోవడంతో కుటుంబపోషణ భారమైంది. రుణాలు పేరుకుపోవడంతో తన చావుకు సీఎం జగనే కారణమంటూ 5 పేజీల లేఖను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఫోన్ స్విచాఫ్ చేసి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. కుటుంబసభ్యులు, మిత్రులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించారు. పెన్న అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో విషం తాగి అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి ఆ తర్వాత అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే కాక, తాము దాచుకున్న సొమ్మును సైతం దారిమళ్లించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నివిధాలుగా తమకు ద్రోహం చేసిన జగన్ సర్కార్ మరోసారి ఎందుకని మండిపడుతున్నారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ బుక్‌లెట్‌లో సచివాలయ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన అంశం ప్రస్తావించడం మినహా ఈ నాలుగున్నరేళ్లలో ఉద్యోగుల సంక్షేమానికి ఏం చేశారో చెప్పలేదు. అంటే నాలుగున్నరేళ్లుగా తమ సంక్షేమం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం దగా చేసిందని ఉద్యోగులు రగిలిపోతున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో జగన్.... సకాలంలో పీఆర్సీలు ఇస్తాం, డీఏలు చెల్లిస్తాం, వారంలో సీపీఎస్ రద్దు చేస్తాం అంటూ ఉద్యోగులను తనవైపు ఆకర్షించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలపై ఏనాడూ పెదవి విప్పలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగారు. కేసులతో ఉద్యోగులను నానా తిప్పలు పెట్టారు. ఉద్యోగులు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కీలక హామీ ‘సీపీఎస్’ రద్దు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్.. మేనిఫెస్టోలోనూ దీన్ని చేర్చారు. తీరా అధికారంలోకి వచ్చాక సీపీఎస్ రద్దుపై మోసం చేశారని... ఓపీఎస్ పునరుద్ధరించకుండా జీపీఎస్ అంటూ ఉద్యోగులకు కంటి మీది కునుకులేకుండా చేశారని వారు విమర్శిస్తున్నారు. ఇదిలావుండగా... సీపీఎస్ ను రద్దు చేయలేదన్న ఆవేదనతో ఉపాధ్యాయుడు మల్లేష్ ఆత్మహత్యకు యత్నించడంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగన్ మాటలు నమ్మి మోసపోయిన అన్నివర్గాల వారు ఉద్యమించాలని... రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలని లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos