ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు పీఏగా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబుకు ముడుపులు అందటంలో శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేసు విచారణ సమయంలో అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికా వెళ్లారు. నోటీసులు ఇచ్చినా తిరిగి రాకపోవటం తో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నట్లు శ్రీనివాస్ పైన అభియోగాలు ఉన్నాయి. కొంతకాలం క్రితం ఐటీ అధికారులు శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసి... విచారణ నిర్వహించారు. ఆ సమయంలో ముడుపుల విషయంలో శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఐటీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకు అందిన ఐటీ నోటీసులు, స్కిల్ స్కాంలోనూ శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను విచారణ సంస్థలు ప్రస్తావించాయి. దీంతో, స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ వేళ శ్రీనివాస్ అనుమతి లేకుండా అమెరికా వెళ్లారు. శ్రీనివాస్… ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు. విదేశాల్లో ఉన్న ఆయన సెప్టెంబర్ 29వ తేదీలోగా తిరిగి వచ్చి వివరణ ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరారు.. అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో… సర్వీస్ నిబంధనలు అతిక్రమించారని పేర్కొంటూ ప్రభుత్వం శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడుతూ.. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా ఉన్న డిజైన్ టెక్‌కు చెందిన మనోజ్ పార్థసాయి కూడా విదేశాలకు పారిపోయాడని తెలిపారు. ఈ కుంభకోణంలో నిందితులు కీలక పాత్రధారులు కావడంతో వారిని తీసుకురావడానికి ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటామని కూడా తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos