నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళనలతో తెలంగాణ అట్టుడుకుతోంది. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువకులు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ బోర్డు అధికారులకు అభ్యర్థులు వినతిపత్రం అందజేయగా... గ్రూప్-2 వాయిదాపై బోర్డు అధికారులు రెండు రోజుల సమయం అడిగారు. అయితే బోర్డు చైర్మన్ జనార్ధన్ రెడ్డి అందుబాటులో లేరని తెలియడంతో ... మాకు బోర్డుపై నమ్మకం లేదని... చైర్మన్‌ను మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ -2 పరీక్షకు ఆగస్టు 29, 30 తేదీలను ఖరారు చేశారని.. కానీ ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్ష తేదీలు ఉన్నాయని అభ్యర్థులు అంటున్నారు.
ఒకే నెలలో గ్రూప్ - 2, గురుకుల పరీక్షలు, జేఎల్ పరీక్షలు నిర్వహిస్తున్నారని... సిలబస్లూ వేర్వేరుగా ఉండటంతో.. ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు. ఈ కారణంతో మాకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని వేర్వేరు ఉద్యోగాలు పొందే అవకాశాలు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రూప్-2 పరీక్షలోని మూడో పేపర్ ఎకానమీలో గతంలోని సిలబస్‌కు అదనంగా 70 శాతం కలిపారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో మూడు నెలలు మానసిక ఆవేదనతో సరిగా చదవలేకపోయామని అంటున్నారు.
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్-2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. మానవతా దృక్పథంతో మా సమస్యను అర్థం చేసుకుని.. వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా... ఆందోళనలో భాగంగా... నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయం నుంచి సుమారు రెండు వేల మంది అభ్యర్థులు పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చారు. అభ్యర్థుల నినాదాలతో టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. గ్రూప్-2 అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపారు.
ర్యాలీగా వస్తున్న అభ్యర్థుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కమిషన్ కార్యాలయం సమీపంలో అభ్యర్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ... గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ... ప్రస్తుతం జేఎల్, గ్రూప్-2 పరీక్షలు వరుసగా ఉన్నాయని అన్నారు. పరీక్షలకు చదువుకునేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని కోరారు.
మరోవైపు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ... గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఏడేళ్లు ఆగిన ప్రభుత్వం.. పరీక్షకు మరో మూడు నెలలు ఆగలేదా అని ప్రశ్నించారు. ఆందోళనల్లో అరెస్టు చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos