తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు కన్నుమూశారు. హైదరాబాద్ లో తీవ్రమైన గుండెపోటుకు గురైన బీఎస్ రావును... కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, అనతికాలంలోనే ఆ సంస్థలను అగ్రగామి పథంలో నడిపించారు. చిన్న కళాశాలతో ఆరంభించిన ఆయన ప్రస్థానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందల పాఠశాలలు, కళాశాలలు నిర్వహించే స్థాయికి ఎదిగింది.  మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలను ప్రారంభించిన ఆయన... అక్కడ్నించి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్ కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను ఉన్నతస్థానానికి చేర్చారు. 

తెలుగు రాష్ట్రాల్లో విద్యావెలుగులు వెదజల్లి వేలాది మందిని వైద్యులుగా, ఇంజినీర్లుగా ఉన్నత స్థానాల్లో నిలబెట్టారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో 1947 ఆగస్టు 1న బొప్పన నాగభూషణం, జానమ్మ దంపతులకు బి.ఎస్. రావు జన్మించారు. బీఎస్ రావు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. భార్య ఝాన్సీ లక్ష్మీబాయి కూడా వైద్యురాలే. వీరికి ఇద్దరు కుమార్తెలు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత భార్యతో కలిసి ఇంగ్లాండ్, ఇరాన్, ఇరాక్ లలో వైద్య వృత్తిలో కొనసాగారు. 12 ఏళ్లు విదేశాల్లో శ్రమించిన తర్వాత ... తిరిగి విజయవాడకు కుటుంబంతో వచ్చారు. 1966లో విదేశాల నుంచి విజయవాడకు చేరుకున్న తర్వాత అదే ఏడాది. బి.ఎస్. రావు దంపతులు వైద్యవృత్తిని మానుకుని విద్యావేత్తలుగా మారారు. ఝాన్సీ లక్ష్మీబాయికి విద్యాసంస్థ నెలకొల్పాలనే ఆసక్తి ఉండేది.

ఇదే సమయంలో బీఎస్‌ రావు దంపతులు తమ కుమార్తెలను విజయవాడలో మంచి కాలేజీలో చదివించాలన్న ఆలోచనతో కాలేజీల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే శ్రీచైతన్య ఆలోచన పురుడుపోసుకుంది. అప్పట్లో పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే మంచి విద్యావసతులు ఉండేవి. గ్రామీణ విద్యార్థులకు ముఖ్యంగా బాలికలకు ఉత్తమ విద్య అందడం చాలా కష్టంగా ఉండేది. వారి ప్రతిభకు తగ్గట్టు మంచి విద్యను అందించాలన్న లక్ష్యంతో 1986లో విజయవాడ పోరంకిలో శ్రీచైతన్య బాలికల జూనియర్‌ కాలేజీని స్థాపించడంతో శ్రీచైతన్య ప్రస్థానం మొదలైంది. తొలుత 86 మందితో ప్రారంభమైన ఈ సంస్థ గత మూడున్నర దశాబ్దాల్లో ఇంతింతై... వటుడింతయిన విధంగా.. ఎంతో ఎత్తుకు ఎదిగి 21 రాష్ట్రాలలో విస్తరించింది. 125 కళాశాలలు, 600 పాఠశాలలు, తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు, 50 వేల మందికి పైగా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో ఆసియాలోనే అతిపెద్ద విద్యాసంస్థగా అవతరించింది. ఏటా జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పరీక్షల్లో విజయకేతనం ఎగరేయడం వెనుక బీఎస్.రావు కృషి, తపన ఉన్నాయి.

 

విద్యారంగంలో బీఎస్‌ రావు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ ఇండియా స్కూల్‌ ర్యాంకింగ్స్‌ నుంచి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ లీడర్‌షిప్‌ అవార్డును 2015లో అందుకున్నారు. విప్లవాత్మకమైన రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ప్రోగ్రామ్‌లపై తల్లిదండ్రులకు భరోసా, పిల్లలకు జాతీయ ప్రవేశ పోటీ పరీక్షల పట్ల మక్కువ కల్పించారు. ఇప్పటివరకు 20 లక్షలమందికి ఇంటర్‌విద్య అందించడంతో పాటు 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఎయిమ్స్‌తోపాటు పలు ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలల్లో అడ్మిషన్లు దక్కేలా చేశారు.  కాగా.. వయోభారం కారణంగా 2012 నుంచి శ్రీచైతన్య విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలను బీఎస్‌ రావు తన కుమార్తెలు సుష్మ, సీమకు అప్పగించారు.

పెద్దకుమార్తె సుష్మ శ్రీచైతన్య కళాశాలలకు, చిన్న కుమార్తె సీమ పాఠశాలలకు అకడమిక్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇదిలావుండగా... బి.ఎస్.రావు మొదట తన కుటుంబంతో విజయవాడలో కరెన్సీనగర్లో ఉండేవారు. తర్వాత నగర శివారులోని తాడిగడప వంద అడుగుల రోడ్డులో ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థల సరస్వతీ సారం ప్రాంగణంలోనే ఇంటిని నిర్మించుకున్నారు. అక్కడే ఉదయం నుంచి రాత్రి వరకూ విద్యార్థుల మధ్యలోనే బి.ఎస్. రావు దంపతులు గడుపుతూ.. వారిని పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలబెట్టేందుకు కృషి చేశారు. వారు పలు సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్నారు. 16 ఏళ్ల వయసులో మృతిచెందిన కుమారుడు కళ్యాణ్‌ చక్రవర్తి స్మారకంగా డాక్టర్‌ బీఎస్‌ రావు దంపతులు తెలుగు రాష్టాల్లో విస్తృతమైన సేవకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ బాధిత గ్రామాలను రెండింటిని దత్తత తీసుకున్నారు. ఫ్లోరోసిస్‌ కారణంగా కన్నుమూసిన కుటుంబాల నుంచి వందమంది చిన్నారులకు ఉచిత విద్యను అందించే కార్యక్రమం చేపట్టారు. దీంతోపాటు ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాల నుంచి కూడా చిన్నారులకు శ్రీచైతన్య విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్య అందించారు.

చివరిసారిగా.. శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు నీట్‌లో సాధించిన విజయానికిగాను ఈ నెల 9వ తేదీన కృష్ణాజిల్లా కంకిపాడులో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ రావు పాల్గొన్నారు. అదే ఆయన పాల్గొన్న చివరి కార్యక్రమం. కాగా.. బీఎస్‌ రావు మృతికి పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఎస్‌ రావు విద్యారంగంలో అందించిన సేవలను కొనియాడారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బీఎస్‌ రావు మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వైద్యునిగా, విద్యావేత్తగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బీఎస్‌ రావు మృతి విద్యారంగానికి తీరనిలోటని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos