ఏపీని రెండు రాష్ట్రాలుగా విభజించి ఇప్పటికీ పంపకాలు పూర్తి చేయని కేంద్రం.. కృష్ణాజలాల వివాదాన్ని కెలకడం ద్వారా తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల వేళ తెలంగాణలో పేరు ప్రతిష్టలు సంపాదించుకునేందుకు .. కృష్ణా ట్రైబ్యునల్ కు జీవం పోయాలని భావించిన కేంద్రం వ్యూహాలు ... ఏపీకి నిద్రలేకుండా చేస్తున్నాయి. కృష్ణా నదీ జలాల పంపకాన్ని తిరిగి చేపట్టాలన్న నిర్ణయంపై ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఏపీతో పోలిస్తే బీజేపీకి తెలంగాణలో కాస్తో కూస్తో సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా జలాల విషయంలో కేంద్రం దూకుడుగా ముందుకెళ్తోందనే విషయం అర్థం అవుతోంది. అయితే ఇది బీజేపీకి కాదు... బీఆర్ఎస్ కే లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఈ సమస్యపై పోరాడుతున్న కేసీఆర్ కే క్రెడిట్ దక్కే అవకాశం ఉంది. అయితే.. కేంద్రం చర్యలతో ఏపీకి భవిష్యత్తులో తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదముందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే కేంద్రం చేస్తున్న వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్ కు వచ్చే ఎన్నికల్లో కృష్ణాజలాల పునఃపంపకాల వ్యవహారం కూడా మెడకు చుట్టుకోబోతోంది. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేటాయించిన జలాల్ని అంగీకరించని తెలంగాణ అప్పటి నుంచీ పోరాటం చేస్తూనే ఉంది. జలాలను పునఃపంపకాలు చేయాలన్న కేసీఆర్ డిమాండ్ ను అంగీకరించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు మార్గదర్శకాలు కేంద్రం జారీ చేసింది. ఇదంతా తెలంగాణకు శుభపరిణామమే అయినా... అంతిమంగా ఏపీకి నష్టం చేసేలా ఉందని ఆ రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని దీన్ని అడ్డుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. కాగా... తాజాగా లేటెస్ట్ డెవలప్ మెంట్ ఏమిటంటే... తెలుగు రాష్ట్రాల మధ్య జలాలను పంపిణీ చేయడం కోసం బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు కేంద్రం కొత్త విధివిధానాలు ప్రతిపాదించింది. ఈ మేరకు టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర జల్ శక్తి శాఖ. అంతర్‌రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టం- 1956 ను అనుసరించి ట్రైబ్యునల్‌కు రెండు విధివిధానాలను ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. కృష్ణా జలవివాద ట్రైబ్యునల్-1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలతోపాటు, దానికి మించి ఏదైనా అదనపు కేటాయింపులు జరిపి ఉంటే వాటినీ పంపిణీ లేదా కేటాయింపు చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు సూచించింది. గోదావరి జలాల మళ్లింపు ద్వారా కృష్ణాలోకి వచ్చే జలాలపై కూడా విచారించాలని పేర్కొంది. మరోవైపు కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఈ అంశంపై ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాజా విధివిధానాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలను మినహాయించి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే పరిమితం చేయడం భావ్యం కాదన్నారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ –2కు మరిన్ని విధి విధా¬నాల జారీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఏపీ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని దీనిపై తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీచేయాలని కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos