పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తోంది. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుండటంతో పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అంతేకాకుండా విపక్షాలు లోక్‌సభలో కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా... అన్ని పక్షాలతో చర్చించిన తర్వాత చర్చకు సమయం నిర్ణయించనున్నట్లుగా ప్రకటించారు. అయితే ప్రతిపక్ష కూటమి ఇండియా మాత్రం.. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే... పార్లమెంట్ సమావేశాల్లో ఇవాళ కూడా మణిపూర్ నిరసనలు మిన్నంటాయి. ఉభయసభలు ఉదయం సమావేశం కాగానే విపక్షాలు అవిశ్వాస తీర్మానంతో పాటు మణిపూర్ పై నిరసనలు వ్యక్తం చేశాయి. దీంతో ఉభయసభల్లోనూ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు మణిపూర్‌పై రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్ తెలపగా... ఈ ప్రతిపాదనను చైర్మన్ ఆమోదించారు. కానీ ప్రతిపక్షం రూల్ 267 కింద చర్చకు పట్టుబట్టింది. చర్చకు ముందు ప్రధానమంత్రి ప్రకటన చేయాలని పట్టుబడుతోంది. దీంతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సభను వాయిదా వేశారు. మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండపై జులై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ప్రారంభమైనప్పటి ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్షాల ఇండియా కూటమికి చెందిన ఎంపీలు హింసాకాండతో దెబ్బతిన్న మణిపూర్ లో రెండురోజుల పర్యటన తర్వాత ఆదివారం న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ లో నిజనిర్ధారణ పర్యటన ముగించుకున్న 21 మంది బహుళ పార్టీల ఎంపీల ప్రతినిధి బృందం ఇవాళ పార్లమెంట్‌లోని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో సమావేశమై ఫ్లోర్ లీడర్‌లకు పరిస్ధితిని వివరించింది. దీంతో ప్రధాని ప్రకటన తర్వాతే పార్లమెంట్ లో దీనిపై చర్చకు అంగీకరించాలని విపక్షాలు పట్టుబట్టినా... ఇందుకు కేంద్రం ఒప్పుకోలేదు. మరోవైపు తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం భయపడుతోందని విపక్షాలు అంటున్నాయి. ఇదిలావుండగా... మణిపూర్ హింసాకాండపై సిట్‌ని ఏర్పాటు చేసి విచారించాలన్న మైతేయిల పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేవలం ఓ వర్గాన్ని దోషిగా చూపించే పిటిషన్‌లను విచారించలేమని తేల్చి చెప్పింది. ఈ అల్లర్లతో పాటు నార్కో టెర్రరిజం, గసగసాల సాగుపైనా విచారణ జరపాలని మైతేయి తరపు న్యాయవాది పిటిషన్‌లో కోరారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం మరింత కచ్చితమైన అంశాలను పిటిషన్‌లో ప్రస్తావించాలని, కేవలం ఓ కమ్యూనిటీని తప్పుపట్టడం సరికాదని స్పష్టం చేసింది. ఇదలావుంచితే... పార్లమెంట్ లో మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు పట్టుపడుతున్న క్రమంలో... ఏం తేలుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos