అనాదిగా మనదేశానికి ఉన్న ఇండియా పేరును కాస్త భారత్ గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగబోతున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో జీ20 దేశాధినేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా విందు కోసం రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికలను పంపించింది. అయితే ఈ ఆహ్వాన పత్రికల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమయింది. మరోవైపు ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల అజెండా ఏమిటనేది ఇంతవరకు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో... ఇండియా పేరును భారత్ గా మార్చేందుకే ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. విపక్షాలు తమ కూటమికి 'ఇండియా' అనే పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కూటమిపై బీజేపీ నిప్పులు చెరిగింది. దేశం పేరు ఎలా పెట్టుకుంటారంటూ బీజపీ నేతలు మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక పెను దుమారానికి దారి తీసింది. దీనిపై విపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇండియా పేరును భారత్ గా మార్చబోతున్నారని జరుగుతున్న ప్రచారం నిజమేనన్నమాట అంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ట్వీట్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం.. 'భారత్, అది ఇండియా, అది రాష్ట్రాల యూనియన్' అని ఉందని ఇప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్స్పై దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, ఇండియాను విడదీస్తున్నారని, అదే భారత్ అని, అదే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని, కానీ మేము అడ్డుకోలేమని జైరాం రమేష్ పేర్కొన్నారు. అలాగే I.N.D.I.A కూటమి లక్ష్యం ఏంటంటే.. BHARAT అని పేర్కొన్నారు. BHARAT అంటే.. బ్రింగ్ హార్మొని, అమిటీ, రీకాన్సిలేషన్ అండ్ ట్రస్ట్ అని తెలిపారు. జూడేగా భారత్, జీతేగా ఇండియా అని ట్వీట్ చేశారు. బీజేపీ ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి లేనిపోని వివాదాన్ని రాజేసిందని సర్వత్రా చర్చ జరుగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos