అల్పపీడన ప్రభావం కారణంగా... తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు హైదరాబాద్ కు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవనున్నట్లు ప్రకటించింది. జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని, వారికి పునరావాసంతోపాటు రేషన్ ఇబ్బంది లేకుండా చూడాలని, గర్భిణులు ఆసుపత్రులకు దగ్గరలో ఉండేలా చూడాలని స్థానిక అధికారులకు సూచిస్తూ ఉన్నతాధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మరోవైపు కుండపోత వర్షాలతో హైదరాబాద్ మునుగుతోంది. ఎక్కడ చూసినా వరద ప్రవాహమే కనిపిస్తోంది. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. మొన్నటిదాకా హైదరాబాద్‌లో సాధారణ వర్షాలే పడ్డాయి. హుసేన్ సాగర్ పరిసరాలు, ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఇలా సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు రోడ్లపై నిలిచిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. రాత్రి గంటపాటు కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షం నిలిచిపోయాక రెండుగంటల తరువాత కూడా ట్రాఫిక్ తగ్గలేదు.

ఐకియా జంక్షన్, హైటెక్ సిటీ, కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే ఆఫీసులూ, పనులకు వెళ్లేవారికి వర్షం ఆటంకంగా మారింది. రోడ్డెక్కితే ట్రాఫిక్‌లో చిక్కుకుపోయే పరిస్థితి ఉంది. లోతట్టు కాలనీల్లోకి వరద నీరు వచ్చేయడంతో.. అక్కడి ప్రజలకు ఇది పెద్ద సమస్యగా మారింది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బందిగా ఉంది. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడం కష్టమవుతోంది కొన్ని రోజులు స్కూళ్లకు సెలవులు ఇస్తే బాగుంటుందని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ వర్షాల వల్ల చాలా ప్రదేశాల్లో రోడ్లపై చెట్లు, కొమ్మలూ కూలిపోతున్నాయి. వాటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ కి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే కురిసిన వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. చేపల వేటకు దూరంగా ఉండాలని, నీరు ప్రవహించే కల్వర్టుల మీదుగా ప్రయాణించే సాహసం చేయొద్దని ప్రభుత్వం పేర్కొంది. పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, వరి, మిరప పొలాల్లో నీరు నిల్వ వుండకుండా బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. ఈ వానలు ఇంకెంతకాలం పడతాయోనంటూ ... రైతులు నిట్టూర్పు విడుస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos