టమోటాలను నిన్నమొన్నటివరకు కేజీలలో కొనేవాళ్లం. ధరలు ఆకాశాన్నంటడంతో.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే మాట అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా వాటిని ఎలా కొనాలో తెలుసా... ఒక టమాటా లేదా రెండు టమోటాలు .. ఇలా ... కేజీలు కాకుండా అంకెల్లో కొనాల్సివస్తోంది. ఎందుకంటే ఇప్పుడు.. ఒక్కో టమోటా రూ.20 ధర పలుకుతోంది. ఇది నమ్మశక్యంగా లేదు కదా... కానీ హండ్రెండ్ పర్సెంట్ నిజం. నిన్న మొన్నటి వరకు కిలో టమాటా ధర రూ.100 ఉండగా, బుధవారం ఏకంగా 200 రూపాయలకు చేరుకుంది. కిలో టమోటా కొనుగోలు చేస్తే 10 నుంచి 12 వరకు వస్తున్నాయి. ఈ లెక్కన ఒక్కో టమాటా ధర సుమారు రూ.20 పలుకుతోంది. కూరగాయల్లో తక్కువ ధరతో లభించడంతో పాటు, ఏ కూరలోనైనా.. రుచి కోసం టమోటాను వినియోగిస్తారు. అలాంటిది పెరిగిన ధరలతో వారంలో ఒకటి, రెండింటిని మాత్రమే వాడే పరిస్థితి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో కేవలం వర్షాధారంగా మాత్రమే టమాటా సాగు చేస్తారు. ఈ సీజన్ లో సాగు తక్కువగా ఉండటం, అధిక వర్షాలతో పంట దెబ్బతినడంతో టమోటాకు కొరత ఏర్పడింది. ఒక్కసారిగా దేశం మొత్తంలో డిమాండ్ ఏర్పడటంతో ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో విక్రయించే టమోటాలు ఎక్కువగా చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వస్తాయి. శ్రీలంకలో వచ్చిన సంక్షోభం కారణంగా ఈసారి టమోటాలు ఎక్కువగా శ్రీలంకకు ఎగుమతి అవుతున్నాయి. ప్రతిరోజూ శ్రీలంకకు 50 ట్రక్కుల వరకు ఎగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డిమాండ్ కు తగిన టమోటాలు సరఫరా కాక తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లలో వీటి ధర విపరీతంగా పెరిగింది. దేశవ్యాప్తంగా కూడా టమోటా ధరల పరిస్థితి ఇలాగే ఉంది. ఏ రాష్ట్రంలో చూసినా టమోటాలకు ఇబ్బంది ఉంది. అతిపెద్ద మార్కెట్ అయిన కర్ణాటకలోని కోలార్ లో కూడా టమోటా ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. ఆకాశంలో నక్షత్రాల సరసన ఉన్న టమోటా ధరలను తగ్గించాలని ప్రభుత్వాలకు సామాన్య ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకదా... అంతకుమించి వారేం చేయగలుగుతారు మరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos