తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ - టీటీడీ ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. భూమన గతంలో రెండుసార్లు టీటీడీ ఛైర్మన్‌గా సేవలందించారు. 2006-08 మధ్య కాలంలో ఆయన టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయ వ్యవహారాలు చూడనున్నారని సమాచారం. ఈ నెల పదోతేదీతో ఆయనకు రెండుసార్లు అంటే నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. అందువల్ల ఆయన స్థానంలో కొత్త ఛైర్మన్ నియామకం జరిగింది.
వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా భూమన కరుణాకర్ రెడ్డికి పేరుంది. 2019 నాటి ఎన్నికల్లో ఆయన తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో... తిరుపతి టికెట్‌ను తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి కేటాయించాలంటూ కొంతకాలంగా కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన భూమన ... టీటీడీ ఛైర్మన్ గా చేసి రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని... తనకు ఆ అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలిసింది. చివరకు ఆయన కోరిక మేరకు టీటీడీ చైర్మన్ పదవి వరించింది. వాస్తవంగా... చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పల్నాడు జిల్లాకు చెందిన బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ రేసులో నిలిచారు.
ఈ ముగ్గురిలో సీఎం జగన్మోహన్ రెడ్డి చివరికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఎంపిక చేసి సస్పెన్స్ కు తెరదించారు. ప్రస్తుత బోర్డు పదవి కాలం ఆగస్టు 10వ తేదీతో ముగుస్తుంది. అనంతరం వైవీ సుబ్బారెడ్డి జాతీయ రాజకీయాల్లో బిజీగా మారనున్నారు. ఈ మేరకు వైసీపీ అధిష్టానం కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ పోస్ట్ అంటే రాష్ట్ర మంత్రి పదవి కంటే ఎక్కువగా భావిస్తారు. అలాంటి పదవి కోసం ఎంత తీవ్ర ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో లోక్ సభ టికెట్ నిరాకరించడంతో వైవీ సుబ్బారెడ్డిని బుజ్జగించడానికి అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఆయనకు టీటీడీ చైర్మన్ పోస్టును ఇచ్చారు. తర్వాత సైతం పదవిని కొనసాగించారు.
ఇదిలావుండగా... అన్ని కీలక పదవులు ఒకే సామాజికవర్గానికి ఇస్తున్నారని కొంతకాలంగా టీడీపీతో పాటు జనసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిని తిప్పికొట్టడానికి ఈసారి టీటీడీ చైర్మన్ పోస్టును బీసీ వర్గాలకు ఇస్తారన్న ప్రచారం జరిగింది. పల్నాడు జిల్లాకు చెందిన బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి అవకాశం దక్కుతుందనే ప్రచారం జరిగింది. ఆయన వైసీపీ ఏర్పాటు నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన యాదవ వర్గానికి చెందిన నేత. పార్టీలోని బీసీ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ ఈసారి ఆయనకు ఈ అవకాశం దక్కలేదు.
ఇక ... వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి... టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. తుడా ఛైర్మన్ హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కూడా కొనసాగతున్నారు. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి, భూమన ఇద్దరూ బరిలోకి దిగడం లేదు. వీరి వారసులు పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో టీటీడీ అత్యున్నత పదవి చెవిరెడ్డికా, భూమనకా అని చర్చ జరుగుతున్న క్రమంలో తనకు అత్యంత ఆప్తుడు అయిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఆ పదవికి సీఎం జగన్ ఎంపిక చేసి సస్పెన్స్ కు తెర దించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos