సుమారు రెండున్నర నెలల పాటు సామాన్య జనాలను ముప్పు తిప్పలు పెట్టిన టమోటా ఆట దాదాపు ముగిసినట్లే. వాటి ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. కిలో 200, లేదా 250 రూపాయల వరకు ఎగబాకిన ధర ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. గత మూడు లేదా నాలుగు రోజులుగా టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. వర్షాలు తగ్గి దిగుబడి పెరగడం, మార్కెట్ లోకి రవాణా పెరగడంతో హైదరాబాద్ నగరానికి టమోటా రవాణా బాగా పెరిగింది. రెండు వారాల క్రితం రోజుకి హైదరాబాద్ నగరానికి 850 క్వింటాళ్ల సరఫరా మాత్రమే జరిగేది. ఇప్పుడది 2450 క్వింటాళ్లకు పెరిగింది. దీంతో ప్రస్తుతం రైతు బజార్ లో టమోటా కేజీ సుమారు 70 రూపాయలలోపు విక్రయిస్తున్నారు. కానీ బయట మార్కెట్లలో కేజీ రూ.120 నుంచి రూ.140 మధ్యలో ఉంది. కానీ ఈ రేటు కూడా అతి కొద్ది రోజులే అని చెబుతున్నారు అధికారులు. తెలంగాణకు ఎక్కువగా అనంతపురం, చిత్తూరు, కర్నాటక నుంచి టమోటా దిగుమతి అవుతుంది. దీనికితోడు రంగారెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, నవాబ్ పేట, మెదక్ జిల్లాల నుంచి కూడా మార్కెట్‌కు టమోటా రవాణా పెరిగింది. పెద్దమొత్తంలో సరకు రావడంతో ధర తగ్గుతోందని అంటున్నారు. ఈ నెలాఖరుకు కిలో రూ.50 వరకు ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే హోల్ సేల్ మార్కెట్ లో టమోటా నాణ్యతను బట్టి ధర ఉంటుంది. మేలు రకానికి ఎక్కువగా.. రెండో రకానికి కాస్త తక్కువగా అధికారులు ధర నిర్ణయించారు. అయితే వ్యాపారులు మాత్రం అన్నిరకాల టమోటాకు ఒకే ధరలను వసూలు చేస్తున్నారు. రైతు బజారులో కిలో రూ.63 అని బోర్డు పెట్టినా కేజీ రూ.100 లకు విక్రయిస్తున్నారు. మొత్తమ్మీద ఈ ఏడాది టమాటా సాగు చేసిన రైతులు భారీగా లాభాలు గడించారు. గతంలోని నష్టమంతా ఒక్క దెబ్బకు భర్తీ చేసేసుకున్నారు. చాలామంది రైతులు టమోటా లాభాలతో నష్టాల నుంచి గట్టెక్కడమే కాదు... లక్షలాధికారులు ... కొంతమంది కోటీశ్వరులు కూడా అయ్యారు. ఇదీ టమోటా సృష్టించిన సునామీ.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos