కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ ఈ నెల 25వ తేదీన తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. 2018 నుండి జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా గుర్తిస్తూ హైకోర్టు తీర్పును వెల్లడించింది. కాగా... ఈ తీర్పు విషయంలో స్టే ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వాలని వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. తీర్పును తాను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని, ఈ మేరకు అప్పీల్‌కు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని, తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ వెల్లడిస్తూ... వనమా వెంకటేశ్వరరావు పిటిషన్ ను కొట్టి వేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ టికెట్ పై విజయం సాధించారు. ఆ సమయంలో ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో ఆస్తులు, కేసుల అంశాలను ప్రస్తావించలేదని జలగం వెంకట్రావు తెలంగాణ హైకోర్టులో 2019లో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ కు తప్పుడు సమాచారం ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. జలగం వెంకటరావు పిటిషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడిస్తూ ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసింది. రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. 2018 నుండి జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించింది. ఈ తీర్పు కాపీని జలగం వెంకట్రావు ఈ నెల 26న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో, అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులుకు అందించారు. ఈ కేసు మున్ముందు ఎలా ములుపులు తిరుగుతుందో చూడాలి మరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos