ఇస్రో చేపట్టిన చంద్రయాన్ -3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కావడంతో కోట్లాదిమంది భారతీయుల నిరీక్షణ ఫలించినట్లయింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్ అవరోహణ క్రమంలో కిందికి దిగుతూ వచ్చింది. అప్పటివరకు అండాకారంలో పరిభ్రమిస్తూ వచ్చిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన వెంటనే వర్టికల్‌గా మారింది. నిట్టనిలువుకు చేరుకుంది. అక్కడే సగం విజయం సాధించినట్లయింది. అనంతరం ఒక్కో దశను అధిగమిస్తూ క్రమంగా చంద్రుడి ఉపరితలంపై అడుగు మోపింది. దీంతో అప్పటివరకు పిన్ డ్రాప్ సైలెంట్‌గా కనిపించిన ఇస్రో మిషన్ కాంప్లెక్స్ మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ల్యాండ్ అయ్యే సమయంలో విక్రమ్ ల్యాండర్ తీసిన తొలి ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. వాటిని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దక్షిణ ధ్రువానికి కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు తీసిన ఫొటోలు అవి. ల్యాండర్‌కు అమర్చిన హారిజాంటల్ వెలాసిటీ కెమెరా వీటిని క్లిక్ మనిపించింది. ఈ ఫొటోలను బెంగళూరులో గల ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్, మిషన్ ఆపరేషన్స్ సెంటర్‌కు పంపించింది. ఈ ఫొటోలు రావడంతో.. ఇక విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్‌తో పూర్తిస్థాయిలో కనెక్టివిటీనీ సాధించినట్లు ఇస్రో తెలిపింది. రెండు వైపుల నుంచి కనెక్ట్ ఏర్పడిందని, తాము పంపించిన సిగ్నల్స్ మాత్రమే కాకుండా, ల్యాండర్ కూడా తన డేటా, ఫొటోలను పంపించగలుగుతోందని పేర్కొంది. ఇదిలావుండగా... ఈ మిషన్‌కు సంబంధించి ఇస్రో చైర్మన్ ఎస్. సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిషన్‌లోని క్లిష్టదశల గురించి సవివరంగా క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రయోగంలో నాలుగు కీలక దశలు ఉన్నాయని... ఈ ప్రయోగంలో అత్యంత క్లిష్టమైన దశ లాంచింగ్‌యే నని అన్నారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ద్వారా చంద్రయాన్-3ని సరైన కక్ష్యలో ప్రవేశపెట్టామని... 36,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక చంద్రయాన్-3 జాబిల్లి దిశగా ప్రయాణించాల్సిన కక్ష్యలోకి చేరిందని... ఈ దశ అనుకున్నట్టుగానే పూర్తయ్యిందని అన్నారు. ఈ ప్రయోగంలో రెండో కీలకదశ ల్యాండింగ్ అండ్ క్యాప్చరింగ్. ఇందులో పొరపాటు జరిగి ఉంటే తేరుకునే అవకాశమే ఉండేది కాదు. మిషన్ విఫలమయ్యేదని ఆయన చెప్పారు. చంద్రుడిపై దిగే ప్రదేశాల్ని చంద్రయాన్-3 గుర్తించడాన్ని శాస్త్రపరిభాషలో క్యాప్చరింగ్ ద మూన్ అని అంటారు. ఇందులో పొరపాట్లు జరిగితే ల్యాండర్ జాబిల్లిపై కూలిపోయేదని అన్నారు. ఇక ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడివడటం మూడో కీలకదశ అని ఆయన వివరించారు. కొన్నిరోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించాక ఆర్బిటర్ నుంచి రోవర్ విడివడిందని... ఇంతటి సుదీర్ఘ ప్రయాణం తరువాత కూడా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయడంతో అనుకున్న సమయానికి ల్యాండర్ ఆర్బిటర్ నుంచి విడివడిందని అన్నారు. ఇక చివరి క్రిటికల్ దశను మనందరం కలిసే వీక్షించామంటూ మిషన్‌కు సంబంధించి కీలక విషయాలను ఇస్రో చీఫ్ వెల్లడించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos