విశాఖలో చంద్రబాబు పాదయాత్రకు నగర వాసులు బ్రహ్మరథం పట్టారు. మంగళవారం సాయంత్రం నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో ఆయన చేపట్టిన పాదయాత్రలో వేల మంది పాల్గొన్నారు. ‘జై చంద్రబాబు’, ‘జైజై చంద్రబాబు’, ‘సీఎం సీబీఎన్’ అనే నినాదాలతో హోరెత్తించారు. ‘విజన్-2047’ డాక్యుమెంట్‌ను విడుదల చేసేందుకు ఆయన మంగళవారం సాయంత్రం విశాఖ వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆర్కే బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ముందుగా జాతిపిత గాంధీజీ చిత్రపటానికి, అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయంత్రం అయిదున్నర గంటలకు భారీ జాతీయ పతాకం చేతబూని పాదయాత్ర ప్రారంభించారు. అప్పటికే బీచ్ రోడ్డుకు వేలాదిగా చేరుకున్న యువతీయువకులు, విద్యార్థులు, న్యాయవాదులు, వివిధ వర్గాలు, రంగాలకు చెందిన ప్రముఖులు, రైతులు, నగర వాసులు, టీడీపీ అభిమానులు ఆయన వెంట నడిచారు. పలువురు బీచ్‌రోడ్డు వెంబడి ఉన్న గోడలపైకి ఎక్కి... చంద్రబాబును ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఆసక్తి చూపించారు. జనం భారీగా తరలిరావడంతో రెండున్నర కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసేందుకు గంటా ఐదు నిమిషాలు పట్టింది. అనంతరం చంద్రబాబు పార్క్ హోటల్ జంక్షన్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి.. విజన్ డాక్యుమెంటు విడుదలకు ఎంజీఎం మైదానంలోకి వెళ్లారు. పాదయాత్రలో ఆయన వెంట సీనియర్ నేతలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా... చంద్రబాబు పై ... మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు కాలజ్ఞానం చెబుతున్నారని ... విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన రైతులను తూటాలతో బలిగొన్న విజనరీ చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం... నమ్మండి అంటూ చంద్రబాబు చెబుతున్నారని పేర్ని నాని జోకులు వేశారు. విజన్ 2047 అంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారని.. చంద్రబాబు విజన్ 2020తో ఏం పొడిచారని ప్రశ్నించారు. నాడు ఉచిత విద్యుత్‌పై ఆయన వెటకారంగా మాట్లాడారని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. చంద్రబాబుది సుత్తి విజన్ అని.. ఆయన విజనరీ ... ప్రాజెక్ట్‌లు పూర్తి చేయలేకపోయిందన్నారు. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశానని చెప్పుకునే దమ్ముందా అని నాని ప్రశ్నించారు. కనీసం కుప్పానికి చంద్రబాబు నీళ్లు ఇచ్చారా అని ఆయన నిలదీశారు. చంద్రబాబుది దిక్కుమాలిన విజన్ అని.. ప్రాజెక్ట్‌ల సందర్శన పేరుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారని నాని మండిపడ్డారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి .... వైజాగ్ లో చంద్రబాబు విడుదల చేసిన విజన్ 2047 ను టార్గెట్ చేశారు. విజన్ 2020 అని దేశమంతా తిరిగి స్వీయ ప్రగల్బాలు పలికిన చంద్రబాబును... 2004లో ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. ఇప్పుడు విజన్ 2047 అంటూ మరో గారడీ చేయాలని చూస్తున్నారని సాయిరెడ్డి ఆక్షేపించారు. రంధ్రాలు పడిన ఓటి పడవకు ఎన్ని అలంకారాలు చేసినా నీటి లోకి వెళ్లిన తర్వాత మునగక తప్పదంటూ సాయిరెడ్డి ... చంద్రబాబుపై సెటైర్లు వేశారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పదే పదే విజన్ 2020 గురించి చెప్పేవారని .... కానీ 2004 నాటికి ఆయన రాష్ట్రంలో అనుసరించిన విధానాల కారణంగా అధికారం కోల్పోయారని అన్నారు. తిరిగి అధికారంలోకి రావడానికి ఆయనకు పదేళ్లు పట్టిందని... 2014లో బీజేపీ, జనసేన కూటమి పొత్తుతో చంద్రబాబు తిరిగి అధికారం సాధించగలిగారని అన్నారు. కానీ ఐదేళ్లలోనే తిరిగి అధికారం కోల్పోయారని అన్నారు. ఇప్పుడు ఆ విషయాల్ని గుర్తుచేస్తూ సాయిరెడ్డి ట్వీట్ పెట్టారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos